ఇప్పుడు మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. గతంలో మల్లువుడ్ స్టార్లు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు చేయడాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మాస్ పరంగా తమకున్న పరిమితులతో పాటు ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా లేదానే అనుమానాల వల్ల డబ్బింగులకే పరిమితయ్యారు. కానీ దుల్కర్ దాన్ని పూర్తిగా మార్చేశాడు. మహానటి, సీతారామంతో దానికి పునాది పడగా ఇప్పుడు లక్కీ భాస్కర్ తో అది మరింత బలపడింది. మనీ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తొంబై దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బ్యాంకు ఉద్యోగిగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
ఈ టాపిక్ కాసేపు పక్కనపెడితే దుల్కర్ సల్మాన్ లుక్స్ పరంగా మంచివాడు, అమాయకంగా కనిపించినా స్క్రీన్ మీద మోసం చేసే వాడిగా చూపిస్తే మాత్రం బొమ్మ సూపర్ హిట్టనే నమ్మకం దర్శకుల్లో బలపడుతోంది. అదెలా అంటారా. మీరే చూడండి. కురుప్ లో తను వేసిన క్యారెక్టర్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం నుంచి దేశవిదేశాలు వెతికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిపోవడం. కనులు కనులు దోచాయంటేలో టెక్నాలజీని వాడుకుంటూ అమాయక జనాన్ని మోసం చేస్తూ కోట్లు వెనకేసే పని. ఇప్పుడు లక్కీ భాస్కర్ లో ఫ్యామిలీ కోసం పని చేసే బ్యాంకుకే అంతర్గతంగా కన్నాలు వేసి లక్షల డబ్బుని పోగేయడం.
ఈ మూడు ఉదాహరణల్లో ఉన్న సారూప్యత మోసం చేయడం. లవర్ బాయ్ గా కనిపించడమే కాదు చీటింగ్ చేసే కన్నింగ్ బాయ్ గానూ ఎంత బాగా మెప్పించగలడో దుల్కర్ మరోసారి నిరూపించాడు. ఇక్కడితో అతను ఆగడం లేదు. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఆకాశంలో ఒక తార తెలుగు సినిమానే. ఇది కూడా కంటెంట్ బలంతో తీస్తున్నదే. డైరెక్టర్ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సబ్జెక్టు మీద నమ్మకంతో పెద్ద బడ్జెట్ పెడుతున్నారు. చూస్తుంటే మన టయర్ 2 హీరోలకు రాబోయే రోజుల్లో దుల్కర్ సల్మాన్ మాంచి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. ఇన్ని హిట్లు వస్తే అంతేగా మరి.