అమరన్ ముందంజలో ఎలా ఉంది

ఎల్లుండి విడుదల కాబోతున్న సినిమాల్లో అమరన్ మీద భారీ అంచనాలేం లేవు కానీ అనూహ్యంగా ఏదో సైలెంట్ కిల్లర్ తరహాలో తెలుగు వెర్షన్ కూ అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఒక తమిళ టైటిల్, టాలీవుడ్ లో ఓ మోస్తరు మార్కెట్ మాత్రమే ఉన్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన సీరియస్ బయోపిక్ కి ఇలాంటి స్పందన ఊహించనిది. అయితే దానికి అసలు కారణం సాయిపల్లవి అంటే ఒకింత ఆశ్చర్యం కలిగినా వాస్తవం. ఓపెనింగ్స్ విషయంలో తన బ్రాండ్ బాగా పని చేయబోతోందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఆమె తర్వాతే మిగిలిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

రెండు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు లక్కీ భాస్కర్, క పోటీలో ఉన్నప్పటికీ అమరన్ కు ఇంత రెస్పాన్స్ రావడం అనూహ్యమే. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాలో ఆయన భార్యగా సాయిపల్లవి నటించింది. బలమైన భావోద్వేగాలతో పాటు వావ్ అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ ని దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందించినట్టు ఇన్ సైడ్ టాక్. దెబ్బకు కోలీవుడ్ కాంపిటీషన్ లో ఉన్న జయం రవి బ్రదర్, కెవిన్ బ్లడీ బెగ్గర్ లు బుకింగ్స్ విషయంలో అమరన్ కన్నా వెనుకబడ్డాయి. అడవి శేష్ మేజర్ తరహా బ్యాక్ డ్రాపే ఈ సినిమాకు ఆకర్షణగా నిలుస్తోంది.

దీపావళి పండగతో సుదీర్ఘమైన వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకున్న అమరన్ కనక ఇక్కడా సక్సెస్ అయితే శివ కార్తికేయన్ మార్కెట్ మరింత బలపడుతుంది. విరాట పర్వం తర్వాత సాయిపల్లవి మళ్ళీ కనిపించలేదు. దాంతో పాటు డబ్బింగ్ మూవీ గార్జి కూడా ఫెయిలవ్వడంతో బ్రేక్ తీసుకుంది. నాగ చైతన్య తండేల్ తప్ప ఇంకేదీ ఒప్పుకోలేదు. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్నవి కాబట్టే దక్షిణాదిలో దీంతో పాటు అమరన్ మాత్రమే సైన్ చేసింది. ఇవి కాకుండా జునైద్ ఖాన్ తో నటిస్తున్న బాలీవుడ్ మూవీ, రన్బీర్ కపూర్ రామాయణంలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో మొదటిది 2025లో రిలీజవుతుంది.