పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో ముప్పై ఎనిమిది రోజుల్లో ఉంది. ఐటెం సాంగ్ షూటింగ్ తప్ప అల్లు అర్జున్ వైపు నుంచి దాదాపు తన భాగం మొత్తం పూర్తయినట్టే. తర్వాత సినిమా ఏదనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు. పలు ఇంటర్వ్యూలలో నిర్మాత నాగవంశీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ప్రాజెక్టు గురించి ఊరిస్తున్నారు తప్పించి ఎప్పుడు మొదలయ్యేది మాత్రం నిర్ధారణగా చెప్పడం లేదు. స్క్రిప్ట్ మాత్రం లాకయ్యిందని ఇటీవలే అన్నారు. రాజమౌళి సైతం టచ్ చేయని జానర్ అంటూ విపరీతంగా ఊరించేశారు. బడ్జెట్ కూడా కల్కి, దేవర, ఆర్ఆర్ఆర్ లను మించే ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
వీటి సంగతలా ఉంచితే అసలు దీన్ని ఎంత టైంలో బన్నీ, త్రివిక్రమ్ పూర్తి చేయాలనుకుంటున్నారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే పుష్ప 2కే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ అంతేసి టైం అంటే అభిమానుల కోణంలో నిరాశ పడే విషయమవుతుంది. నిజానికి కథ కుదిరితే తక్కువ వ్యవధిలో అంటే ఆరు నెలల్లో ఆట్లీతో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయాలనీ బన్నీ అనుకున్నాడు. కానీ కుదరలేదు. సందీప్ రెడ్డి వంగాకో కమిట్ మెంట్ ఇచ్చాడు కానీ ప్రభాస్ తో స్పిరిట్ పూర్తి చేస్తే తప్ప అతను ఫ్రీ అవ్వలేడు. దీనికో రెండేళ్లు పడుతుంది. సో త్రివిక్రమ్ తో ప్రొసీడ్ అవ్వడం తప్ప బన్నీకి ఇంకో ఆప్షన్ ఉండకపోవచ్చు.
ఇకపై స్టార్ హీరోలు కనీసం ఏడాదికి ఖచ్చితంగా ఒక సినిమా చేయాలని అభిమానులు, ట్రేడ్ వర్గాలు కోరుకుంటున్నాయి. అలా చేస్తేనే సింగల్ స్క్రీన్లు అధిక శాతం మూతబడకుండా చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ అలా సాధ్యపడటం లేదు. సంవత్సరానికి మూడు రిలీజ్ చేసే నాని సైతం మార్కెట్ పెరగడం వల్ల ఒకటికి పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇక టయర్ 1 హీరోల గురించి చెప్పనక్కర్లేదు. కానీ యూనిట్ సమాచారం మేరకు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ కొంత ఆలస్యమైనా టాకీ పార్ట్, పాటలు మాత్రం వేగంగా ఒక ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసేలా సితార టీమ్ సన్నద్ధంగా ఉందట. చూడాలి మరి ఏం చేయబోతున్నారో.