కిరణ్ అబ్బవరం ఘటికుడే

సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్.. వీటిలో ఏది అతి పెద్ద డిజాస్టర్, కంటెంట్ పరంగా ఏది వరస్ట్ మూవీ అంటే తేల్చుకోవడం కష్టం. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఈ కళాఖండాలను అందించి తనకు అంతకుముందు వచ్చిన పేరునంతా చెడగొట్టుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇంత తక్కువ టైంలో అన్ని డిజాస్టర్లు ఇచ్చాక పుంజుకోవడం చాలా కష్టమే అవుతుంది. తన క్రెడిబిలిటీ, మార్కెట్‌ను తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం అన్న అభిప్రాయం వచ్చేసింది అందరికీ.

తన కొత్త సినిమాల మీద ప్రేక్షకులకు కనీస ఆసక్తి కూడా కనిపించలేదు ఒక దశలో. తన కెరీర్ ముగిసిందని తీర్మానించేసిన వాళ్లూ ఉన్నారు. కానీ ‘క’ అనే వెరైటీ సినిమా చేసి.. దాని పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంలో కిరణ్ విజయవంతం అయ్యాడు.

‘క’ అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేయడమే ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టింది. ఇక ఆ సినిమా టీజర్ రిలీజయ్యాక ఈసారి కుర్రాడు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనే క్యూరియాసిటీ పెరిగింది. ఇక రిలీజ్ దగ్గర పడేసరికి సినిమా మీద ఇంకా అంచనాలు పెంచడంలో కిరణ్ అండ్ టీం విజయవంతం అయింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ వావ్ అనిపించింది. సినిమా చూడాలనే ఉత్సుకతను ప్రేక్షకుల్లో పెంచుతోంది. ఈ దీపావళికి దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’ కూడా రిలీజవుతుండగా.. దాన్ని మించి ‘క’ మీద అంచనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

సోషల్ మీడియాలో దీపావళికి మీ ఛాయిస్ ఏదని పోల్స్ పెడుతుంటే ‘క’కే అత్యధిక ఓట్లు పడుతుండడం విశేషం. తన సినిమా రిలీజ్ ఉన్నా సరే ‘క’ను మలయాళంలో రిలీజ్ చేయడానికి దుల్కర్ ముందుకు వచ్చాడంటే తనకు ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఎలా ఉంటుందో కానీ.. రిలీజ్ ముంగిట ‘క’కు హైప్ తీసుకురావడంలో కిరణ్ విజయవంతం అయ్యాడు. అందులోనూ డిజాస్టర్ స్ట్రీక్ తర్వాత ఈ చిత్రానికి హైప్ తేగలగడం గొప్ప విషయమే.