మాములుగా ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరో సినిమా వస్తోందంటే బరిలో ఎవరు ఉండరు. ఒకవేళ ముందే ప్లాన్ చేసుకున్నా ప్రకటన రాగానే తప్పుకుంటారు. ఇది బాహుబలి నుంచి రిపీట్ గా జరుగుతూనే ఉంది.
అంతెందుకు గత ఏడాది సలార్ తొలుత సెప్టెంబర్ లో ప్లాన్ చేసుకున్నప్పుడు ముందే ఆ డేట్ ని తీసుకున్న మీడియం బడ్జెట్ చిత్రాలు వేరే ఆలోచన లేకుండా డ్రాపయ్యాయి. తిరిగి పోస్ట్ పోన్ అయిపోయి డిసెంబర్ కు వెళ్ళాక క్రిస్మస్ కు ఎవరూ సవాల్ చేయలేదు. షారుఖ్ ఖాన్ డంకితో ట్రై చేశాడు కానీ క్లాష్ వల్ల ఆయనకు కలిగిన నష్టం ఏంటో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు బాగా తెలుసు.
కానీ ఈసారి కొంచెం సీన్ వేరేలా ఉండబోతోంది. 2025 ఏప్రిల్ 10కి ది రాజా సాబ్ అధికారికంగా లాకైన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే ముందు వెనుకా ఎవరూ రాకుండా ఇతర ప్రొడ్యూసర్లు సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నారు.
అయితే కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్ లైఫ్ ని ఏప్రిల్ 10 రిలీజ్ చేయబోతున్నట్టు కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందినట్టు చెన్నై రిపోర్ట్. షూటింగ్ కొన్ని వారాల క్రితమే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులకు బోలెడు సమయం ఉండటంతో మంచి క్వాలిటీ వచ్చేలా చూసుకుంటున్నారు.
ఇదే కనక నిజమైతే ది రాజా సాబ్ కు తమిళనాడు, కేరళలో థియేటర్ సమస్యలు తప్పకపోవచ్చు. ఇండియన్ 2 ఎంత డిజాస్టర్ అయినా దాని ప్రభావం మరీ తీవ్రంగా తగ్ లైఫ్ మీద ఉండదు. ఎందుకంటే నాయకుడు వచ్చిన ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత రిపీటవుతున్న కాంబో ఇది.
దీనికి శింబు, ఏఆర్ రెహమాన్ లాంటి బలమైన ఆకర్షణలు తోడయ్యాయి. సో సహజంగానే హైప్ ఎక్కువగా ఉంటుంది. ది రాజా సాబ్ ఉందని తెలిసినా తగ్ లైఫ్ ఈ నిర్ణయానికి రావడానికి కారణం తమిళ ఉగాది పండగట. కల్కి 2898లో హీరో విలన్ గా నటించిన భైరవ, యాస్కిన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద తలపడబోతరేమో.