బన్నీకి రాజకీయం ఆపాదించొద్దు – మైత్రి రవి

జరిగిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లి రావడం గురించి ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని డిస్కషన్ కు అంతూపొంతూ ఉండదు. ఇవాళ జరిగిన పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లోనూ ఈ ప్రస్తావన వచ్చింది. ఆన్ లైన్ మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ అభిమానులు రెండుగా విడిపోయిన నేపథ్యంలో దాని ప్రభావం ఓపెనింగ్స్ మీద ఏమైనా ఉంటుందా అని ఎదురైన ప్రశ్నకు మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టత ఇచ్చారు.

అల్లు అర్జున్ రాజకీయంగా ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని, వ్యక్తిగత మద్దతుని పరిగణనలోకి తీసుకుని అదేదో పొలిటికల్ పార్టీకి ఆపాదించవద్దని చెబుతూ వీలైనంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న ఇన్సి డెంట్స్ ఏవైనా ఉన్నా అవి కేవలం పరిమిత కాలానికి మాత్రమేనని, వాళ్లంతా ఒకటేనని నవీన్ సైతం దీని గురించి మాట్లాడ్డం విశేషం. పుష్ప 2 రిలీజ్ టైంలో ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ జరగొచ్చనే ఊహాగానాల ప్రచారంలో ఉన్న టైంలో ఇలాంటి టాపిక్ రావడం సహజమే. అయితే సమావేశంలో ప్రత్యక్షంగా అల్లు అర్జున్ లేడు కాబట్టి ఇంతకన్నా సమాధానం ఆశించలేం.

ప్రమోషన్లు త్వరలో మొదలుకాబోతున్నాయి కనక బన్నీ ప్రత్యేకంగా వాటిలో పాల్గొన్నప్పుడు ఏదో ఒక రూపంలో దీనికి సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. నిజానికి ఇరు వైపులా ఫ్యాన్స్ దాని కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం. అయినా సినిమాలు పాలిటిక్స్ వేర్వేరు అయినప్పటికీ ఇలా అనుకోకుండా జరిగే ఘటనల వల్ల ముడిపెట్టే పరిస్థితి వస్తుంది. డిసెంబర్ 5 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ చేతిలో రెండు నెలల సమయం కూడా లేదు. వచ్చే నెల రెండు పాటలు, ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. నవంబర్ మొదటి వారానికి షూట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.