‘యమలీల’ తెర వెనుక ట్విస్టులు భలే భలే

కమెడియన్ ఆలీని హీరోగా పెట్టి పాతికేళ్ల కిందట పెద్ద సంచలనమే రేపాడు లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. అప్పట్లో ఆ సినిమా పెద్ద ట్రెండ్ సెట్టర్ అయింది. పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకున్నాడు ఎస్వీ కృష్ణారెడ్డి.

ఐతే ఈ సినిమాను మహేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ తనే నిర్మించాలని సూపర్ స్టార్ కృష్ణ అనుకున్న సంగతి తెలిసిందే. కానీ కృష్ణారెడ్డి మాత్రం ఆలీనే హీరోగా పెట్టి సినిమా చేయాలని ఫిక్సయ్యారు. దీంతో కృష్ణ మిన్నకుండిపోయారు. అదేమీ మనసులో పెట్టుకోకుండా ఈ సినిమాలో ‘జుంబారే..’ పాటలో నర్తించి ఆకర్షణ పెంచారు. ఐతే ఆలీని హీరోగా కొనసాగించే విషయంలో కృష్ణారెడ్డికి వేరే సమస్యలు వచ్చాయట.

ఈ చిత్రానికి ముందు సౌందర్యను కథానాయికగా ఖరారు చేశారట కృష్ణారెడ్డి. అప్పటికే ఆయనతో ఆమె వరుసగా మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నంబర్‌వన్ లాంటి హిట్ సినిమాల్లో నటించిన మంచి పేరు సంపాదించింది. దీంతో స్టార్ స్టేటస్ వచ్చి పెద్ద హీరోల సరసన కూడా అవకాశాలు రావడం మొదలైంది. అలాంటి సమయంలో ఆలీ పక్కన ‘యమలీల’ చేస్తే తన కెరీర్‌కు మంచిది కాదని చెప్పి, హీరోను మార్చమని అడిగిందట సౌందర్య. కానీ ఆలీ కాకుండా ఎవరు చేసినా ఈ సినిమా చెడిపోతుందని కృష్ణారెడ్డి అన్నారట.

చివరికి సౌందర్య కృష్ణారెడ్డినే ఇందులో హీరో చేయమని అడగ్గా.. ఇది తాను చేసే సినిమా కాదని ఆయన తేల్చేశారట. తర్వాత సౌందర్య ఈ సినిమా చేయనందని, తాను కూడా ఈ సినిమాలో విలన్ పాత్ర చేయనంటూ కోట శ్రీనివాసరావు తప్పుకున్నారట. దీంతో ఆ స్థానంలో తోటరాముడిగా తనికెళ్ల భరణిని తీసుకున్నారట కృష్ణారెడ్డి.

ఐతే తర్వాత ఆలీ ఇందులో హీరో అని తెలుసుకుని కోట శ్రీనివాసరావు తిరిగి కృష్ణారెడ్డి దగ్గరికొచ్చి సారీ చెప్పి, ‘మా ఆలీని హీరోగా పెడుతున్నారా.. మీరు ఏ పాత్ర ఇచ్చినా చేస్తా’ అనడంతో పోలీస్ పాత్రను ఇచ్చారట ఆయన. చివరికి తాను అనుకున్న ప్రకారమే ఆలీని పెట్టి సినిమా తీస్తే అది అనూహ్య విజయం సాధించిందని కృష్ణారెడ్డి ఆలీనే నిర్వహించే ఒక టీవీ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.