థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చడంలో మల్టీప్లెక్సుల పాత్ర చాలా పెద్దది. పట్టుమని పాతిక రూపాయలు ఖరీదు చేయని పాప్ కార్న్ ని అయిదు వందలకు కొనిపించేలా చేయడంలో సక్సెసైన ఘనత కూడా వీటికే దక్కుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ఆదాయాలు లేకపోవడం యాజమాన్యాలను ఖంగారు పెడుతోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ఒక మల్టీప్లెక్స్ సముదాయానికి మొత్తం అన్ని స్క్రీన్లు కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలేసుకుని చూసుకుంటే నికరంగా పదిహేను కోట్లకు పైగా నష్టమే మిగిలింది తప్ప ఓనర్ కు ఒక్క రూపాయి మిగల్లేదని ట్రేడ్ టాక్.
కల్కి, దేవర, హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లు రెవెన్యూలు తెస్తున్నప్పటికీ ఏడాది మొత్తం ఖర్చులను మేనేజ్ చేయడానికి అవి సరిపోవడం లేదు. నెలకు కనీసం మూడు సూపర్ హిట్లు లేనిది మనుగడ కష్టమైన టైంలో రెండు నెలలకోకటి రావడమే గగనమైపోతోంది. ఉదాహరణకు బాలీవుడ్ నే తీసుకుంటే స్త్రీ 2 వచ్చి రెండు నెలలు దాటుతున్నా దాన్ని మించే విజయం ఇంకే హిందీ సినిమా సాధించలేదు. మన దగ్గర దేవర తర్వాత ఎన్ని రిలీజైనా దాని దరిదాపుల్లోకి వెళ్లిన కొత్త మూవీ ఒక్కటి లేదు. ఇదంతా నిర్వహణ వ్యయం మీద తీవ్ర ప్రభావం చూపించి బడ్జెట్ లను విపరీతంగా పెంచేస్తోంది.
దీంతో ఒక మల్టీప్లెక్స్ చైన్ త్వరలో రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తోందట. అంటే విలాసవంతమైన విందు భోజనాలు, తిండి పదార్థాలు అందించే హోటళ్లను తమ థియేటర్లోనే పెడతారన్న మాట. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. అయితే వినోదం కోసం థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను ఈ తిండి గోలతో విసిగిస్తే ప్లాన్ రివర్స్ అయ్యే అవకాశాలను సదరు సంస్థ సీరియస్ గా విశ్లేషించే పనిలో ఉంది. అయినా షోలు పెంచకుండా, టికెట్ రేట్లు తగ్గించకుండా, స్నాక్స్ ధరలు సవరించకుండా ఇలాంటి మార్కెటింగ్ ప్లాన్లు ఎన్ని వేసినా ప్రయోజనం తక్కువే.