వేట్టయాన్‌పై కౌంటరేసి కవర్ చేసిన నిర్మాత

ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న చిన్న విషయాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. మీడియాతో మాట్లాడేటపుడు మూవీ మేకర్స్ ఏదైనా నోరు జారితే సోషల్ మీడియా దాన్ని వలువలు చిలువలు చేసేస్తోంది. అందుకే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. అలా కాని పక్షంలో విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇప్పుడు తమిళ నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా మీడియా ముందు నోరు జారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాను ప్రొడ్యూస్ చేసిన ‘కంగువ’ సినిమా 2 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని కామెంట్ చేయడంతో.. ఏమిటీ అతి అంటూ ఆయన్ని ట్రోల్ చేశారు జనం. అది చాలదన్నట్లు పరోక్షంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయన్’ మీద కౌంటర్లు వేయడంతో దాని మీద వివాదం నడిచి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్ఞానవేల్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘కంగువ’ సినిమాకు సంబంధించి కాస్టింగ్ వివరాలను ముందే ఎందుకు బయటపెట్టలేదు అని. దానికాయన బదులిస్తూ.. “ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. ఆ చిత్రం మొదలవుతున్నపుడే నటీనటుల వివరాలన్నీ పంచుకున్నారు. కానీ దాని వల్ల సినిమాకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు రజినీ సినిమా ‘వేట్టయన్’ను ఉద్దేశించే అని భావించి రజినీ అభిమానులు జ్ఞానవేల్ రాజాను టార్గెట్ చేశారు. రజినీ సినిమా ప్రారంభమైనపుడే ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వెల్లడించారు.

ఐతే తన వ్యాఖ్యల మీద వివాదం చెలరేగడంతో జ్ఞానవేల్ రాజా వివరణ ఇచ్చాడు. తాను ఏ సినిమా పేరూ చెప్పలేదని.. తననూ ఎవరూ అడగలేదని.. ఎవరికి వాళ్లు ఏదో ఊహించేసుకున్నారని.. నిజానికి తాను మాట్లాడింది హిందీ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’ గురించి అని చెప్పాడు జ్ఞానవేల్ రాజా. కానీ ఈ మాటను నెటిజన్లు నమ్మట్లేదు. హిందీ మూవీ గురించి జ్ఞానవేల్ మాట్లాడేందుకు ఆస్కారం లేదని.. ఆయన కామెంట్ చేసింది ‘వేట్టయన్’ గురించే అని.. ఇప్పుడు వివాదం అయ్యేసరికి కవర్ చేయడానికి ‘ఖేల్ ఖేల్ మే’ పేరు చెబుతున్నాడని విమర్శిస్తున్నారు.