క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నా చితకా వేషాలేనే కళ్యాణికి మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ వుంది. అందుకే ఆమెను ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి అని పిలుస్తుంటారు. హరికథలు చెప్పడంలోను ఆమె సిద్ధ హస్తురాలు. బిగ్‍బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజీపై హరికథ చెప్పి అందరి మన్ననలు అందుకుంది.
హౌస్‍లో కేవలం రెండు వారాలు మాత్రమే వున్నా కానీ బిగ్‍బాస్ షోతో కళ్యాణికి పాపులారిటీ బాగానే వచ్చింది. బిగ్‍బాస్ నుంచి బయటకు రాగానే కనిపించిన అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేయడం రివాజు. అలా కళ్యాణి గత వారం అంతా యూట్యూబ్‍లో ట్రెండ్ అవుతూనే వుంది. బిగ్‍బాస్ వల్ల ఇప్పుడు తనకు అవకాశాలు పెరుగుతాయని భావిస్తోందా అంటే సినిమా ఛాన్సుల పరంగా పెద్దగా మార్పులేమీ వుండకపోవచ్చునని చెప్పింది.
అయితే సినిమా ఛాన్సుల మాట అటుంచి ఆమె ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికలలో బిజెపి తరఫున టికెట్ సాధించి బరిలోకి దిగాలని కళ్యాణి తనకు తెలిసిన కాంటాక్ట్స్ వాడుతోందని సమాచారం. వచ్చే ఎన్నికలలో బిజెపి నుంచి ఆమెకు టికెట్ లభించినట్టయితే పవన్ ఫాన్స్ కూడా మద్దతివ్వాల్సి వుంటుంది. మరి భాజపాతో పవన్ జనసేన మిలాఖత్ అయింది కనుక… కళ్యాణి అనుకున్నది సాధిస్తే జనసైనికులు తనకు అండదండలు ఇచ్చి తీరాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates