అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో ఇది ఏప్రిల్ 30న రావడం విశేషం. ఈ రోజును విశేష శుభదినంగా పరిగణించి, లక్ష్మీదేవిని కృప పొందే ఒక మంచి అవకాశంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు సంపదకు సూచికగా బంగారం, వెండి కొనడం వల్ల ఐశ్వర్యం వస్తుందన్న నమ్మకంతో చాలామంది నగలు కొనడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
దీపం ప్రాముఖ్యత:
ఈరోజు దేవతలను సంతోషపెట్టే విధంగా ఇంట్లో దీపాలను వెలిగించడం విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది. ఇంట్లో ఉత్తర దిశను సంపద దిశగా పరిగణించడం వల్ల, అక్కడ దీపం వెలిగించడం ద్వారా శ్రేయస్సు, శాంతి, ధనసంపదలు కలుగుతాయని నమ్మకం. కుబేరుడు, లక్ష్మీదేవి దిశగా ఉత్తర దిశను పరిగణిస్తారు కాబట్టి ఆ దిశలో దీపం పెట్టడం లక్ష్మీప్రజంగా భావిస్తారు.
అలానే, వంటగదిలో త్రాగునీరు నిల్వ చేసే ప్రదేశంలో దీపం వెలిగించడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసించబడుతోంది. దీనివల్ల అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోయే అవకాశముందని చెబుతారు. ఇంటి వద్ద బావి లేదా చెరువు వంటి నీటి వనరులు ఉంటే, వాటి సమీపంలో దీపాలు వెలిగించటం ద్వారా ప్రకృతికి కృతజ్ఞత తెలిపినట్లు అవుతుంది.
ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు వైపులా నెయ్యితో మట్టి దీపాలను వెలిగిస్తే, లక్ష్మీదేవి ఆ గృహంలో ప్రవేశిస్తుందని విశ్వాసం. శుభ్రత, వెలుగుతో కూడిన వాతావరణాన్ని దేవతలు ఇష్టపడతారని భావించడంతో,గడపకు పసుపు పూసే ముగ్గులు పెట్టి, దీపాలను వెలిగిస్తే ధనసంపద పెరుగుతుందని నమ్ముతారు.ఈరోజు చేసే శుభకార్యాలకు శాశ్వత ఫలితాలు కలుగుతాయని విశ్వసించే ప్రజలు, అక్షయ తృతీయను అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు.
గమనిక: పై సమాచారం కేవలం పాటకుల ఆసక్తి మేరకు అందించాము. ఇవి పలువురు పండితులు, ఆన్లైన్ సమాచారం ఆధారంగా అందించడం జరిగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates