బాలయ్య పవన్ ల తొలి సుదీర్ఘమైన కలయికలో రూపొందిన ఆన్ స్టాపబుల్ షోలో ఇద్దరి మధ్య పలు ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్రభాస్ వచ్చినప్పుడు చేసినట్టే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం బాలకృష్ణ మళ్ళీ రామ్ చరణ్ కు ఫోన్ చేయడం విశేషం. పరస్పరం పలకరింపులు అయ్యాక ఇద్దరికీ సంబంధించిన ఏదైనా ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పమన్నారు బాలయ్య. చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మాతగా బిజీగా ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలను చూసుకునే డ్యూటీ మొత్తం పవన్ మీదే పడేదట. దాంతో సహజంగా ఉండే బాండింగ్ తో ప్రత్యేక అనుబంధం చరణ్ తో కుదిరింది.
ఓసారి సింగపూర్ వెళ్ళినప్పుడు చరణ్ వయసు అయిదేళ్ళు. అసలే దూకుడు మనస్తత్వం. కుదురుగా ఉండకుండా అటుఇటు పరిగెత్తేవాడు. వెంటే ఉన్న పవన్ కు తనను చూసుకునే బాధ్యత. అక్కడ పిజ్జాలు బర్గర్లంటూ ఏది బడితే అది తినేసిన చరణ్ కు నడిరోడ్డు మీదే వామిటింగ్ లాంటిది జరిగిపోయింది. దీంతో పవనే అందరూ చూస్తున్నారని మొహమాటపడకుండా మొత్తం శుభ్రం చేసే బాధ్యతను తీసుకుని నేరుగా హోటల్ కు తీసుకెళ్లిపోయారు. ఇది అధిక శాతం ఫ్యాన్స్ కు తెలియని ముచ్చట. ఎప్పుడో చిరుత ప్రమోషన్ టైంలో మా ఛానల్ కి ఇద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంఘటన ప్రస్తావించారు.
చివరిలో ఫోన్ పెట్టే సమయంలో జాగ్రత్త రా ఉంటా అంటూ పవన్ చెప్పడం, ఇదంతా చూస్తూ బాలయ్య ఏం క్యూట్ ఫ్యామిలీ అయ్యా మీదంటూ ప్రశంసలు గుప్పించడం ట్విట్టర్ లో వీడియో రూపంలో తిరగేస్తోంది. గత రెండు రోజులుగా ఓజి ట్యాగ్ గురించి చరణ్ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ పడుతున్న టైంలో ఇప్పుడిది బయటపడటం గమనార్హం. అయినా రంగస్థలం టైంలోనే వీడు కొడుకు కాదు తమ్ముడు అని పబ్లిక్ గా ప్రకటించాక కూడా వాస్తవాలు గమనించుకోకుండా అర్థం లేని ఆన్ లైన్ వార్ కు దిగడం శోచనీయం. ఇదంతా సరే కానీ ఇద్దరూ కలిసి నటిస్తే అప్పుడు జరిగే రచ్చ ఊహకందటం కష్టమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates