‘సింపతీ కార్డ్’పై నాగవంశీ కౌంటర్

సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్ రావడం.. ఫలితాలు నిర్ణయం కావడం లాంటి అనూహ్య పరిణామాలు ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఫలానా నటుడో, దర్శకుడో, నిర్మాతో యాటిట్యూడ్ చూపించాడని.. హద్దులు దాటి మాట్లాడాడని.. రాజకీయ అంశాలపై తన వైఖరిని వెల్లడించాడని వాళ్ల సినిమాల మీద పగబట్టి నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం, వాటి ఫలితాలను ప్రభావితం చేయడం అప్పుడప్పుడూ జరుగుతోంది. 

అదే సమయంలో స్టేజ్ మీద తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్న వారి మీద జాలి కలిగి సినిమాలకు మద్దతు తెలపడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలా లాభపడ్డ, అలాగే నష్టపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ధోరణిని ఇండస్ట్రీ జనాల్లో కొందరు తప్పుబడుతున్నారు. అందులో నిర్మాత నాగవంశీ ఒకరు. ఆయన కొంచెం ఔట్ స్పోకెన్ అన్న సంగతి తెలిసిందే. ఐతే తాను కాన్ఫిడెంట్‌గా, ఓపెన్‌గా మాట్లాడడం కొందరికి యాటిట్యూడ్ అనిపించి.. తన సినిమాలను టార్గెట్ చేయడం గురించి ఈ మధ్య ఆయన ఆవేదన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ చైతు జొన్నలగడ్డ (సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు) చేసిన ఒక పాడ్ కాస్ట్ తాలూకు వీడియోను నాగవంశీ షేర్ చేశారు. సినీ జనాలు సింపతీ కార్డును వాడడం గురించి ఈ వీడియోలో చైతు భలేగా కౌంటర్లు వేశాడు. సినిమా వాళ్లు ఎలా మాట్లాడతారు అన్నదాన్ని బట్టి కూడా ఈ మధ్య వాళ్ల సినిమాలను ఆదరించడం, టార్గెట్ చేయడం చేస్తున్నారని అతనన్నాడు. ఎవ్వరైనా కొంచెం కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే.. దాన్ని యాటిట్యూడ్‌గా పేర్కొంటూ మీ సినిమాల సంగతి చూస్తాం అని వార్నింగ్‌లు ఇస్తున్నారన్నాడు. 

అదే సమయంలో ఎవరైనా స్టేజ్ మీద ఎమోషనల్ అవుతూ కష్టాలు చెప్పుకుంటే కరిగిపోయి వాళ్లకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారని.. వాళ్లకు కోట్లు ఉన్నా సరే ఇలా సింపతీ కార్డ్ వాడితే కరిగిపోతున్నారని అతనన్నాడు. ఈ వీడియోను నాగవంశీ షేర్ చేయడం ద్వారా తనదీ ఇదే బాధ అని చెప్పకనే చెప్పాడు. తాను కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే టార్గెట్ చేస్తున్నారని.. వేరే వాళ్లు సింపతీ కార్డ్ వాడితే వాళ్ల సినిమాల పట్ల పాజిటివ్‌గా స్పందిస్తున్నారన్నది నాగవంశీ అభిప్రాయంగా కనిపిస్తోంది.