లెక్క తప్పిన కలర్ ఫోటో దర్శకుడు

ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా తెరకెక్కించిన విధానంలో నిజాయితీ కనిపించడంతో ఆడియన్స్ ప్రశంసలు, వ్యూస్ అందజేశారు. ఏకంగా జాతీయ అవార్డు రావడమనేది ఎవరూ ఊహించనిది. దర్శకుడు సందీప్ రాజ్ ఎక్కువ మందికి తెలియడానికి అవకాశమిచ్చింది ఈ మూవీ. అలాంటి టాలెంటెర్ డైరెక్టర్ అయిదేళ్ళు గ్యాప్ తీసుకుని వస్తున్నాడంటే అంచనాలు ఉంటాయి. కానీ మోగ్లీ ఫలితం నిరాశ కలిగించే దిశగా వెళ్తోంది. రోషన్ కనకాల రెండో ప్రయత్నం ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరయ్యేలా ఉంది వసూళ్లు చూస్తుంటే.

కలర్ ఫోటో తర్వాత సందీప్ రాజ్ జర్నీ గమనిస్తే డైవెర్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. పలు సినిమాల్లో సైడ్ విలన్ గా దర్శనమిచ్చాడు. ఎయిర్ వెబ్ సిరీస్ కు రచనతో పాటు కీలక బాధ్యతలు చూసుకున్నాడు. అందులో ఒక సామాజిక వర్గాన్ని ట్రిగ్గర్ చేస్తూ రాసిన డైలాగులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకొచ్చాయి. మాములుగా అయితే రాజీ పడని ఈటీవీ బృందం ఆ సన్నివేశాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. మోగ్లీ విడుదలకు ముందు తనకే ఎందుకిలా జరుగుతుందని సింపతి ట్వీట్ చేసినప్పుడు ఏదో గొప్ప కంటెంట్ ఇస్తున్నాడని అందరూ భావించారు. కానీ జయంలాంటిది రీమిక్స్ చేస్తాడని ఊహించలేదు.

ఒక హిట్ సినిమాతో పేరు వచ్చాక దాన్ని రెట్టింపు చేసుకోవడానికి కష్టపడాలి. అర్జున్ రెడ్డి ప్రొడక్షన్ కోసం ఎక్కడెక్కడో తిరిగి ఢక్కామొక్కీలు తిన్న సందీప్ రెడ్డి వంగ ఇవాళ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే స్థాయికి చేరుకున్నాడు. అదే విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తీసిన తరుణ్ భాస్కర్ తన మార్కెట్ ని తనే కుదించుకున్నాడు. కారణాలేంటో చెప్పనక్కర్లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ సందీప్ రాజ్ వాడుకోలేకపోయాడు. పని చేసిన వాళ్లందరికీ తన మోగ్లీ ఒక విజిటింగ్ కార్డులా పని చేస్తుందని చెప్పిన సందీప్ రాజ్, ఇప్పుడు తనకే ఆది డేట్ అయిపోయిన డెబిట్ కార్డు అవుతుందని ఊహించి ఉండడు.