ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి ఒక్కో భాగంతో వేలకోట్ల వసూళ్లు కొల్లగొడుతూ చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాలను తన మాయాజాలంలో మునిగేలా చేయడం ఆయన స్టయిల్. టైటానిక్ తో చరిత్ర సృష్టించినా, ట్రూ లైస్ తో మెస్మరైజ్ చేసినా, టెర్మినేటర్ తో టెక్నాలజీ మాయాజాలాన్ని పరిచయం చేసినా ఆయనకే చెల్లింది. ఆస్కార్ అవార్డులను పల్లీలు తిన్నంత ఈజీగా తన చిత్రాలకు వచ్చేలా చేసుకోవడం జేమ్స్ క్యామరూన్ కే చెల్లింది. అంతటి దిగ్గజం సాధారణంగా ఇతరులను పొగడరు.
కానీ రాజమౌళి దానికి మినహాయింపుగా నిలుస్తున్నారు. ఎల్లుండి విడుదల కాబోతున్న అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ప్రీమియర్ చూసిన జక్కన్న తన అనుభవాలను వీడియో కాల్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా జేమ్స్ క్యామరూన్ తో పంచుకున్నారు. అరగంటకు పైగా జరిగిన ఈ సంభాషణలో ఫిలిం మేకింగ్ గురించి ఇద్దరి మధ్య బోలెడు కబుర్లు వచ్చాయి. ముఖ్యంగా వారణాసి ప్రస్తావన రావడం మూవీ లవర్స్ ని తెగ ఎగ్జైట్ చేస్తోంది. మీ సినిమా సెకండ్ యూనిట్ కెమెరా ఆపరేటర్ గా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకసారి సెట్స్ కు తప్పకుండా వస్తానని, పులులతో తీసే సీన్లు ఏమైనా ఉంటే చెప్పమని క్యామరూన్ కోరారు.
సరదాగా అన్నా సరే ఇది ఆస్కార్ కన్నా గొప్ప ఘనతగా దీన్ని భావించాలి. ఎందుకంటే తెలుగు సినిమాల గురించి అంతగా పట్టించుకోని జేమ్స్ క్యామరూన్ ఇప్పుడు ఏకంగా నేను నీ దగ్గర పని చేస్తానని రాజమౌళికి చెప్పడం ప్రతి సినీ ప్రియుడు గర్వించే విషయమే. ఇప్పుడీ వీడియో క్లిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఏడాదిన్నరగా వారణాసి షూటింగ్ చేస్తున్నామని చెప్పిన రాజమౌళి పలు సందర్భాల్లో తన సంతోషాన్ని దాచుకోలేక బిగ్గరగా నవ్వుతూ ఓపెన్ అయిపోయారు. చూస్తుంటే వారణాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జేమ్స్ క్యామరూన్ నే ముఖ్యఅతిథిగా తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. నిజమైనా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates