ఏపీకి ప్రత్యేక హోదా.. అమరావతి మీద కేసీఆర్ స్టాండ్ ఏమిటి?

KCR

తనకు అలవాటైన పిచ్ మీద ఏ బ్యాట్స్ మెన్ అయినా.. బౌలర్ అయినా ఇరగదీస్తాడు. కానీ.. తనకు అలవాటు లేని ఫార్మాట్ లో ఆడాల్సి వచ్చినప్పుడు మాత్రం కాస్తంత తొట్రు పాటు ఖాయం. ఆటలో ఉండే ఈ ఇబ్బందికి మించి రాజకీయాల్లో ఉంటుందని చెప్పాలి. ఇంతకాలం వినిపించిన తెలంగాణ సెంటిమెంట్ కు భిన్నంగా.. తన పరిధి యావత్ దేశమని.. దేశ ప్రయోజనాలకు తగ్గట్లు తన ఆలోచనలు.. ప్రణాళికల్ని చెప్పాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చేసిందని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల మీద మోజు పుట్టిన గులాబీ బాస్..అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లలో తలమునకలైనట్లుగా చెబుతున్నారు. అటు ఫాం హౌస్ లోనూ.. ఇటు ప్రగతి భవన్ లో బ్యాక్ టు బ్యాక్ భేటీలతో బిజీగా ఉన్న ఆయన.. తానేం చేయాలి? తానేం చెప్పాలనుకున్న విషయాల మీద పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఏదైనా పని మొదలు పెట్టే వేళలో.. దానికి సంబంధించిన హోం వర్కును పక్కాగా చేసే కేసీఆర్.. దానికి సంబంధించిన విషయాల్ని ఎంతలా చెబుతారు? అన్నది తెలిసిందే.

గొర్రెల స్కీంను తెలంగాణలో ప్రవేశ పెట్టే వేళలో.. ఆయన చెప్పిన మాటలు.. వచ్చే కొన్నేళ్లలో గొర్రెల కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎంత బలోపేతం కాబోతుందన్న విషయంపై ఆయన చెప్పిన లెక్కలు వాస్తవంలోకి ఎలా ఉన్నాయన్నది అందరికి తెలిసిందే. ఇలా.. అరచేతిలో వైకుంఠం చూపించే కేసీఆర్.. ఏపీ విషయంలో ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ ఏపీ మీద.. ఆంధ్రోళ్ల మీద విరుచుకుపడే ఆయన.. ఇప్పుడు ఏపీ ప్రజల మనసుల్ని దోచుకునేలా చెప్పే మాటలు ఏం ఉంటాయన్నది ప్రశ్నగా మారింది. జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేయాలనుకుంటున్న ఆయన.. వేటికి సమాధానం చెప్పినా చెప్పకున్నా.. ఏపీ విషయంలో ఆయన స్టాండ్ ఏమిటన్న దానిపై వెల్లువెత్తే ప్రశ్నలు చాలానే ఉంటాయన్నది తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ విభజన వేళ.. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇవ్వటం.. దాన్ని మోడీ సర్కారు ఏర్పాటైన తర్వాత ఆ డిమాండ్ ను ఎలా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి హోదాలో ఉన్న నేత స్వయంగా ఇచ్చిన హామీని సైతం పక్కన పెట్టేసిన మోడీ తీరుపై పీకల్లోతు కోపంతో ఉన్నా.. ఆయనకున్న బలం ముందు ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి.

మోడీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పనున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. తన సోదర రాష్ట్రమైన ఏపీ విషయంలో ఆయన ఏం చెబుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. న్యాయ బద్ధంగా ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏమిటి? అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో మోడీ శంకుస్థాపన చేసిన ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ ఏం చెబుతారన్నది కూడా ఆసక్తికర అంశమే. జాతీయ అంశాలు.. వాటికి కేసీఆర్ స్టాండ్ ఏమిటన్న దాని కంటే కూడా తన పక్కనున్న ఏపీకి సంబంధించిన కీలకమైన రెండు అంశాలపై ఆయన చెప్పే సమాధానాలు ఆయన ఇమేజ్ ను ప్రభావితం చేస్తాయన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.