పాత  సినిమా ముందు కొత్త‌ది వెల‌వెల‌

తెలుగులో రీ రిలీజ్ సినిమాల ఊపు సాగుతున్న టైంలో కొత్త‌గా వ‌చ్చిన కొన్ని సినిమాల‌ను మించి పాత వాటికి బుకింగ్స్ జ‌ర‌గ‌డం అప్ప‌ట్లో ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇప్పుడు త‌మిళ‌నాట ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎప్పుడో 2004లో రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన విజ‌య్ మూవీ గిల్లికి ఇప్పుడు త‌మిళ‌నాట వ‌స్తున్న స్పంద‌న చూసి అంద‌రూ షాక‌వుతున్నారు.

ఒక్క‌డుకు రీమేక్‌గా రూపొంది.. త‌మిళంలో ఇంకా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ఈ చిత్రాన్ని కొన్ని రోజుల కింద‌టే త‌మిళ‌నాడు వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. దీని కోసం ఒక కొత్త సినిమా స్థాయిలో ఎగ‌బ‌డుతున్నారు త‌మిళ ప్రేక్ష‌కులు. రిలీజైన రోజు నుంచి హౌస్ ఫుల్స్‌తో న‌డుస్తోంది గిల్లి. ఈ వీకెండ్లో త‌మిళ‌నాడు అంత‌టా అదే బాక్సాఫీస్ లీడ‌ర్‌గా కొన‌సాగుతుండ‌టం విశేషం.

కొత్త‌గా విశాల్ మూవీ రత్నంతో పాటు ఒరు నోడి అనే మ‌రో థ్రిల్ల‌ర్ మూవీ కూడా రిలీజ‌య్యాయి. వీటిలో ర‌త్నం పెద్ద బ‌డ్జెట్లో, విశాల్-హ‌రిల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా. కానీ ఈ చిత్రానికి రిలీజ్ ముంగిట ఆశించిన హైప్ లేదు. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌డ‌బ‌డుతోంది. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఒరు నోడికి మంచి టాక్ రాగా వ‌సూళ్లు ప‌ర్వాలేదు. అయితే వీటిని మించి గిల్లికి ఎక్కువ రెస్పాన్స్ క‌నిపిస్తోంది.

బుక్ మై షోలో టికెట్ల అమ్మ‌కాల ట్రెండ్స్ చూస్తే స్ప‌ష్టంగా గిల్లిదే పైచేయిగా క‌నిపిస్తోంది. విశాల్ కొత్త‌ మూవీకి 24 గంట‌ల్లో 33 వేల టికెట్లు అమ్ముడైతే.. విజ‌య్ పాత చిత్రానికి 45 వేల దాకా టికెట్లు తెగాయి. దీన్ని బ‌ట్టే త‌మిళ‌నాట గిల్లి హ‌వా ఎలా సాగుతోందో అంచ‌నా వేయొచ్చు. గిల్లి మూవీకి నిండుగా ఉన్న థియేట‌ర్ల‌లో అభిమానుల హంగామాకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.