జగన్ లేఖపై జస్టిస్ రమణ వివరణ కోరిన సీజేఐ బొబ్డే

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్ చేసిన అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ పరంగా జగన్ లేఖ సంచలనం రేపింది. దేశపు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి జగన్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అందులోనూ, బాబ్డే తర్వాత సీజేఐ రేసులో ఉన్న జస్టిస్ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ లేఖ రాయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే సీరియస్ గా ఫోకస్ చేసినట్టు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ సంచలన కథనం వెలువడింది. జగన్ చేసిన ఆరోపణలపై జస్టిస్ ఎన్వీ రమణను జస్టిస్ బొబ్డే వివరణ కోరినట్టు ఆ కథనంలో ప్రచురించింది. జగన్ ఆరోపణలను నిశితంగా పరిశీలించిన తరువాతే జస్టిస్ బొబ్డే న్యాయ వ్యవస్థలో సంస్కరణలను చేపట్టారని ఆ కథనం సారాంశం. న్యాయ వ్యవస్థలో ఉన్నాయని భావిస్తోన్న కొన్ని లోపాలను సరిదిద్దడానికి జస్టిస్ బొబ్డే నడుం బిగించారని తెలుస్తోంది.

జగన్ లేఖలోని అంశాలు, ఆరోపణలపై జస్టిస్ బొబ్డే లోతుగా విశ్లేషించిన తర్వాతే చర్యలకు నడుం బిగించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాబ్డే ఆదేశాలతోనే జగన్ తన లేఖను 3 నెలల క్రితమే అఫిడవిట్ రూపంలో మరోసారి పంపించారని తెలుస్తోంది. జగన్ రాసిన లేఖపై జస్టిస్ ఎన్వీ రమణ, గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అభిప్రాయాన్ని జస్టిస్ బొబ్డే తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ లేఖపై జస్టిస్ బొబ్డేకు జేకే మహేశ్వరి వివరణ ఇచ్చారని, తాజాగా ఎన్వీ రమణను జస్టిస్ బొబ్డే వివరణ కోరారని తెలుస్తోంది. ఈ లేఖపై తన తోటి న్యాయమూర్తులతోనూ జస్టిస్ బొబ్డే క్షుణ్ణంగా చర్చించారని, ఆ లేఖపై మరింత లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయడం, అంతకుముందు మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పిటీషన్ వ్యవహారంలో జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్‌ను తొలగించడం వంటి పరిణామాలు జస్టిస్ బొబ్డే చేపట్టిన సంస్కరణల్లో భాగమేనని తెలుస్తోంది.