ప్రముఖ బాలీవుడ్ నటుడి ఆత్మహత్య

బాలీవుడ్ మరో మంచి నటుడిని కోల్పోయింది. హిందీ, ఇంగ్లిష్ సినిమాలతో నటుడిగా గొప్ప పేరు సంపాదించిన అసిఫ్ బస్రా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం బాలీవుడ్‌ను విషాదంలో నింపింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో తన ఇంట్లో అసిఫ్ బస్రా గురువారం ఉదయం ఉరి వేసుకుని కనిపించడం కుటుంబ సభ్యులను విస్మయానికి గురి చేసింది. ఆయనది ఆత్మహత్యగానే భావిస్తున్నారు.

ఐతే దీనిపై నిర్ధారణకు రాకుండా పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది విచారణ సాగిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ లాంటిదేమీ పోలీసులకు దొరకలేదు. నటుడిగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అసిఫ్ బస్రాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందో ఎవరికీ అంతుబట్టడం లేదు. మీడియాలో ఎక్కడా దీనికి గల కారణాలేమీ వెల్లడి కాలేదు.

పర్జానియా, బ్లాక్ ఫ్రైడే, కై పో చే, వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై, జబ్ వుయ్ మెట్, క్రిష్ 3, ఏక్ విలన్, ఫ్రీకీ అలీ, కలాకండి, తాష్కెంట్ ఫైల్స్, హిచ్కి.. ఇలాంటి ప్రముఖ చిత్రాల్లో అసిఫ్ బస్రా కీలక పాత్రలు పోషించాడు. ఈ చిత్రాల వరుస చూస్తేనే అతడి స్థాయి, అభిరుచి ఏంటన్నది అర్థమవుతుంది. హిందీలో కొత్త తరహా సినిమా ఏది తెరకెక్కుతున్నా ఏదో ఒక పాత్ర కోసం బాలీవుడ్ దర్శకులు.

ట్రెండీగా, సటిల్‌గా అనిపించే యాక్టింగ్‌తో అసిఫ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. పాతాల్ లోక్, హాస్టేజెస్, వోహ్ లాంటి వెబ్ సిరీస్‌లతోనూ అసిఫ్ సత్తా చాటాడు. ఔట్ సోర్స్డ్ అనే హాలీవుడ్ సినిమాలోనూ అసిఫ్ నటించడం విశేషం. తమిళంతో పాటు మరికొన్ని భాషల్లోనూ అతను నటించాడు. అసిఫ్ వయసు 53 ఏళ్లు. నటుడిగా మంచి స్థాయిలో ఉండగా అర్ధంతరంగా ఆయన జీవితం ముగిసిపోవడం అభిమానులను విషాదంలో ముంచింది.