రాజమౌళి రికార్డులకు పాతరే


సంక్రాంతి టైంలో ఓ మోస్తరు సినిమా పడ్డా చాలు. వసూళ్ల మోత మోగిపోతుంది. ఈసారి ఆ పండక్కి రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ కూడా యావరేజ్ సినిమాలే. వేరే సమయాల్లో రిలీజైతే ఆ చిత్రాలు అసలు హిట్టయ్యేవా అన్నది సందేహమే. కానీ సంక్రాంతి టైంలో ఈ చిత్రాలను ప్రేక్షకులు విరగబడి చూశారు. వసూళ్ల మోత మోగిస్తూ ఈ రెండు చిత్రాలూ ఆ హీరోల కెరీర్లలో హైయెస్ట్ గ్రాసర్లు అయ్యాయి.

మూడేళ్ల కిందట వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు కూడా అంచనాలను మించి భారీ వసూళ్లనే సాధించాయి. ఈ పండక్కి మంచి అంచనాలున్న ఓ భారీ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వసూళ్ల ప్రభంజనం మామూలుగా ఉండదు. ఐతే ఇప్పటిదాకా తెలుగులో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. 2024 సంక్రాంతి రాబోయే చిత్రం మరో ఎత్తు.

2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రభాస్ సినిమా ‘ప్రాజెక్ట్-కే’ విడుదల కానున్నట్లు ఈ రోజే ప్రకటించారు. ఈ చిత్రంపై ఉన్న అంచనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాల్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన, అత్యధిక అంచనాలున్న సినిమా ఇదే. ఇదొక సూపర్ హీరో సినిమా కావడం.. అమితాబ్ బచ్చన్-దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఉండడం.. ‘మహానటి’ తర్వాత నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సినిమా కావడంతో హైప్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సినిమా సంక్రాంతికి వస్తే హైప్ మరిన్ని రెట్లు పెరగడం ఖాయం.

ఇండియాలో మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం వసూళ్ల మోత మోగిపోవడం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ రాజమౌళి సినిమాల రికార్డులన్నీ కూడా బద్దలైపోయి.. కొత్తగా ఏపీ, తెలంగాణ వరకు ప్రతి ఏరియాలోనూ నాన్-ప్రభాస్ రికార్డులు నమోదవడం పక్కా.