సోనూ సూద్‌పై ఇంతలోనే..

జనాలు ఎవరిని ఎప్పుడు హీరోల్ని చేస్తారు.. ఎప్పుడు జీరోల్ని చేస్తారో అర్థం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో ఏదైనా సరరే చాలా వేగంగా జరిగిపోతుంటుంది. గత ఏడాది కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడంతో సోనూ సూద్ ఎలా హీరోగా మారాడో తెలిసిందే. రాజకీయ నాయకులు, సినీ హీరోలను మించి అతను ఇమేజ్ సంపాదించుకున్నాడు. రియల్ హీరో అనిపించుకున్నాడు. అతడికి జనం దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు. సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా అతడికి భారీగా అభిమాన గణం తయారైంది. అతను కూడా తట్టుకోలేని స్థాయిలో ప్రేమను కురిపించారు. సోషల్ మీడియాలో అయితే సోనూ సూద్‌కు ఏ స్థాయిలో ఎలివేషన్లు ఇస్తుంటారో తెలిసిందే. ఐతే ఇన్నాళ్లూ హీరోగా ఉన్న సోనూ.. ఇప్పుడు ఉన్నట్లుండి విలన్ అయిపోయాడు నెటిజన్ల దృష్టిలో.

#WhoTheHellAreUSonuSood.. ట్విట్టర్లో గురువారం ఉదయం నుంచి ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. రాత్రి అయితే ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయింది. ఉన్నట్లుండి సోనూ మీద ఇలాంటి నెగెటివ్ ట్యాగ్ వేయడానికి కారణం లేకపోలేదు. అతను మహాశివరాత్రి సందర్భంగా ఒక ట్వీట్ వేశాడు. కేవలం ఒక ఫొటో పెట్టి విష్ చెప్పడం కాకుండా ఎవరికైనా సాయం చేస్తేనే నిజమైన మహా శివరాత్రి అని అతను పేర్కొన్నాడు. ఈ ట్వీట్ నెటిజన్లకు నచ్చలేదు. హిందువుల పండక్కి మాత్రమే సెలబ్రెటీలు ఇలా నీతులు బోధిస్తారని.. మిగతా మతాల పండుగల విషయంలో ఏ కామెంట్ చేయరని అంటూ అతడి మీద విరుచుకుపడ్డారు. పైన పేర్కొన్న హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని విపరీతంగా ట్రోల్ చేశారు. జనాల నుంచి ఇలాంటి స్పందనను సోనూ ఊహించలేదు.

దీపావళి టైంలో కూడా సెలబ్రెటీలు టపాసులు కాల్చొద్దని, కాలుష్యానికి కారకులు కావొద్దని ట్వీట్లు వేసి నెటిజన్ల వ్యతిరేకత ఎదుర్కోవడం తెలిసిందే. హిందువుల పండుగలకే ఇలా సెలబ్రెటీలు నీతులు బోధిస్తారంటూ నెటిజన్లు వారిని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే సోనూకు కూడా సోషల్ మీడియా సెగ తగిలింది.