కందిరీగ-2.. పవన్‌తో ఓ సినిమా

తొలి సినిమా ‘కందిరీగ’తో కమర్షియల్ సినిమాలు తీయడంలో మంచి నైపుణ్యం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సంతోష్ శ్రీనివాస్. కానీ ఆ ఆ తర్వాత ఇప్పటిదాకా అతను మరో సక్సెస్ ఫుల్ సినిమా తీయలేకపోయాడు. రెండో సినిమాకే జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు కానీ.. వీరి కలయికలో వచ్చిన ‘రభస’ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత తన తొలి చిత్ర కథానాయకుడు రామ్‌తో ‘హైపర్’ తీశాడు. అది కూడా ఆడలేదు.

మధ్యలో పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కినట్లే దక్కి చేజారింది. తమిళ బ్లాక్‌బస్టర్ ‘తెరి’ రీమేక్ మీద అతను కొన్ని నెలల పాటు పని చేయడం.. చివరికి ఆ సినిమా క్యాన్సిల్ కావడం తెలిసిందే. దీని వల్ల కెరీర్లో విలువైన సమయం వృథా అయింది. ఐతే ఆ నిరాశ నుంచి కోలుకుని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమాను రూపొందించాడు సంతోష్.

సంక్రాంతి కానుకగా ఈ నెల 15న రాబోతున్న ‘అల్లుడు అదుర్స్’ సూపర్ హిట్టవడం ఖాయమని అంటున్న సంతోష్.. తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. ‘కందిరీగ’కు సీక్వెల్ చేసే ఆలోచన ఎప్పట్నుంచో ఉందని.. అది త్వరలోనే కార్యరూపం దాల్చొచ్చని.. ఆ స్క్రిప్టు మీద పని చేస్తున్నానని సంతోష్ తెలిపాడు. అలాగే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం చేజారడంపై మాట్లాడుతూ.. ఇప్పుడా అవకాశం చేజారినా ఆయన్ని మెప్పించే కథ తయారు చేస్తానని.. ఆయన్ని ఒప్పించి కచ్చితంగా సినిమా చేస్తానని సంతోష్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇక ‘అల్లుడు అదుర్స్’లో సోనూ సూద్ పాత్ర గురించి మాట్లాడుతూ.. లాక్ డౌన్‌ టైంలో ఆయన రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో తన పాత్రలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సంతోష్ వెల్లడించాడు. ఆయన పాత్ర ఎంతో వినోదాత్మకంగా ఉంటుందని సంతోష్ అన్నాడు.