జ‌న‌సేన‌కు మ‌రో టికెట్ క‌ట్‌? రీజ‌న్ ఇదే!

ఏపీలో బీజేపీ, టీడీపీల‌తో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన పార్టీకి మ‌రో టికెట్ క‌ట్ అవుతోందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జ‌న‌సేన‌.. త‌ర్వాత బీజేపీ కోరిక మేర‌కు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి ప‌డిపోయింది. వీటిలో ఇప్ప‌టికి 18 స్థానాల‌కు మాత్రమే జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మిగిలిన 3 స్థానాల‌కుఅ భ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు బీజేపీ మ‌రో సీటు కోరుతోంద‌ని బీజేపీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

దీనిపై కేంద్ర నాయ‌క‌త్వం కూడా ప‌వ‌న్‌కు ఫోన్ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ఆ ఒక్క సీటును కూడా జ‌న‌సేన నుంచి తీసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఫ‌లితంగా ప‌వ‌న్ కు 20 స్థానాలే మిగ‌ల‌నున్నాయ‌ని స‌మాచారం. వాస్త‌వానికి టీడీపీ-జ‌న‌సేన పార్టీల‌తో చేతులు క‌లిపిన బీజేపీ.. . ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఇంకా వీటిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, ఇంత‌లోనే మ‌రో సీటు కోసం అభ్య‌ర్థ‌న‌లు ముందుకు వ‌చ్చాయి.

పార్టీలో నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం జ‌న‌సేన వైపు వేళ్లు చూపిస్తోంది. దీంతో జ‌న‌సేన నుంచే ఈ ఒక్క సీటును తీసుకునేందుకు బీజేపీ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలోనే ఆ పదకొండో స్థానం పై చ‌ర్చ సాగింది. కడప లేదా చిత్తూరు జిల్లాల‌లోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. అయితే.. టీడీపీ ఇప్ప‌టికే దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. కేవ‌లం 5 స్థానాల‌కు మాత్ర‌మే ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇవి టీడీపీ వ‌దులుకునే నియోజ‌క‌వ‌ర్గాలు కావు. దీంతో బీజేపీ ప్ర‌తిపాద‌న‌ల‌ను జ‌న‌సేన కోర్టులోకి నెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.