టాలీవుడ్‌ మలయాళం మోజులో పడిందే

తెలుగులో రీమేక్‌లు కొత్తేమీ కాదు. ఐతే రీమేక్ కోసం మనవాళ్లు ఎప్పుడూ చూసేది తమిళం వైపే. అక్కడి నుంచి వందల్లో సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి. అప్పుడప్పడూ హిందీ లేదా మరో భాషలోంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి మారుతోంది.

తమిళ సినిమాల క్వాలిటీ పడిపోవడం, అక్కడి నుంచి తెలుగులోకి రీమేక్ అయిన సినిమాల ఫలితాలు కూడా తేడా కొట్టడంతో మన వాళ్లు తమిళ మోజు వదిలించుకున్నారు. ఐతే ఆ స్థానంలోకి మలయాళం వచ్చేస్తోంది. అక్కడి కథల్ని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

కొన్నేళ్ల కిందట మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో తీస్తే మంచి ఫలితాన్నందుకుంది. ఆ సినిమాను తెలుగులో నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మధ్యే రెండు మలయాళ చిత్రాల రీమేక్ హక్కులు తీసుకోవడం విశేషం.

ఈ ఏడాది ఆరంభంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పునుం కోషీయుం’ హక్కులు తీసుకుని రానా, రవితేజలతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సంస్థ.. ఇప్పుడు ‘కప్పెలా’ చిత్ర హక్కులు కూడా తీసుకుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ను సైతం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకోవైపు ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా రీమేక్ హక్కుల కోసం కూడా మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఆ చిత్రం కూడా తెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇవి కాక ‘మహేషింటే ప్రతీకారం’ అనే చిన్న సినిమా ఇప్పటికే తెలుగులో రీమేక్ అయింది. అదే.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా.. సత్యదేవ్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు.

ఇలా వరుసబెట్టి తెలుగులోకి మలయాళం సినిమాలు వచ్చేస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుణ్యమా అని మలయాళ సినిమాల క్వాలిటీ మనవాళ్లకు తెలుస్తుండటం, అలాగే మన ప్రేక్షకుల అభిరుచి కూడా మారడంతో మల్లు సినిమాలు వరుసగా తెలుగులోకి వచ్చేస్తున్నాయి.