సన్ ఆఫ్ ఇండియా ట్రెండింగ్.. కానీ పాపం

ఇంకొక్క రోజులో థియేటర్లలోకి దిగబోతోంది విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా వైభవం చూసిన ఆయన.. గత రెండు దశాబ్దాల్లో మార్కెట్ అంతా కోల్పోయారు. హీరోగా చేసిన సినిమాలన్నీ నిరాశ పరచడం.. తనకు తానుగా సినిమాలు బాగా తగ్గించేసుకోవడంతో క్రేజ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి.

చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘గాయత్రి’ మూవీ కనీస ప్రభావం కూడా చూపించలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మోహన్ బాబు. కానీ ఈ సినిమా పట్ల ఆడియన్స్‌లో కనీస ఆసక్తి కూడా కనిపించడం లేదు. ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజవుతుండగా.. సినిమా బుకింగ్స్ చూస్తే దయనీయంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 50 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుంటే.. విడుదలకు 24 గంటల ముందు రెండంకెల సంఖ్యలో టికెట్లు అమ్ముడైన థియేటర్ ఏదీ కనిపించడం లేదు.

చాలా థియేటర్లలో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా తెగని పరిస్థితి. థియేటర్ దగ్గర బుకింగ్ కోసం బ్లాక్ చేసిన కొన్ని వరుసల్లో మాత్రమే టికెట్లు అందుబాటులో లేవు. మిగతావన్నీ అందుబాటులో ఉండగా.. ఏవో కొన్ని థియేటర్లలో 2, 3, 4.. ఇలా కొన్ని టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో నంబర్ వన్ మల్టీప్లెక్స్ అనదగ్గ ఏఎంబీ సినిమాస్‌లో ఎలాంటి సినిమాకైనా ఓ మోస్తరుగా బుకింగ్స్ ఉంటాయి. చిత్రం ఏదన్నది సంబంధం లేకుండా ఇక్కడొచ్చి సినిమా చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు.

అలాంటి థియేటర్లో కూడా పది టికెట్లయినా అమ్ముడవని పరిస్థితి నెలకొంది. మార్నింగ్ షోలకే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా షోల గురించైతే చెప్పాల్సిన పని లేదు. బుకింగ్స్ పరిస్థితి ఇలా ఉంటే.. ట్విట్టర్లో ఏమో #SONOFINDIA హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. దాన్ని కూడా పాజిటివ్‌గా చూడటానికేమీ లేదు. ఈ హ్యాష్ ట్యాగ్ మీద ఉన్న కంటెంట్ అంతా ట్రోలింగే. ‘సన్ ఆఫ్ ఇండియా’ బుకింగ్స్ గురించి వస్తున్న వార్తల మీద రకరకాల జోకులు, మీమ్స్ తయారు చేసి మోహన్ బాబును, విష్ణును తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.