హాట్ సీన్ల‌తో ట్రెండ్ సెట్ చేసిన దీపిక‌

పెళ్ల‌యిన హీరోయిన్లు గ్లామ‌రస్ రోల్స్ చేయ‌కూడ‌దు. ఇంటిమేట్ సీన్ల‌లో అస‌లే న‌టించ‌కూడ‌దు. లిప్ లాక్స్ జోలికి వెళ్ల‌నేకూడ‌దు. ప‌ద్ధ‌తిగా, సంప్ర‌దాయ బ‌ద్ధంగా ఉండే పాత్ర‌లే చేయాలి. హీరోయిన్ రోల్సే చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి కూర్చోకూడ‌దు. క్యారెక్ట‌ర్ రోల్స్‌కు ఓకే చెప్పేయాలి. ఇవ‌న్నీ అప్ర‌క‌టిత రూల్స్. వీటినే చాలామంది హీరోయిన్లు ఫాలో అయిపోతుంటారు.

ఫిలిం మేక‌ర్స్ దృష్టికోణం కూడా ఇలాగే ఉంటుంది. కానీ గ‌త కొన్నేళ్ల‌లో ఈ ఆలోచ‌న‌లు మారిపోతున్నాయి. హీరోయిన్లు పెళ్ల‌య్యాక కూడా బోల్డ్ రోల్స్ చేస్తున్నారు. ఇంటిమేట్ సీన్ల‌కు ఓకే చెబుతున్నారు. ద‌ర్శ‌కులు కూడా పెళ్ల‌యిన హీరోయిన్ల‌కు ఇలాంటి రోల్స్ ఇస్తున్నారు. అయినా స‌రే.. పెళ్ల‌యిన‌ హీరోయిన్లు కొంత హ‌ద్దుల్లో ఉండ‌టానికే చూస్తారు. భ‌ర్త నుంచి అభ్యంత‌రాలు లేక‌పోయినా.. సొసైటీ నుంచి, సోష‌ల్ మీడియా నుంచి ఎలాంటి వ్య‌తిరేక‌త వ‌స్తుందో అన్న భ‌య‌మే అందుక్కార‌ణం.

ఐతే బాలీవుడ్ అగ్ర క‌థానాయిక దీపికా ప‌దుకొనే ఈ శ‌ష‌బిష‌లేమీ పెట్టుకోకుండా గెహ్ర‌యాన్ సినిమాలో బోల్డ్ రోల్ చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే దీపికా కెరీర్లోనే బోల్డెస్ట్ రోల్‌గా దీన్ని చెప్పొచ్చు. ఆల్రెడీ త‌న‌కు పెళ్లయి సంసార జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ. త‌న క‌జిన్ బాయ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ పెట్టుకునే మ‌హిళ పాత్ర‌లో న‌టించింది దీపిక ఇందులో. ఫిబ్ర‌వ‌రి 11న‌ అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైల‌ర్ లాంచ్ చేశారు. ఇందులో యువ న‌టుడు సిద్దాంత్‌తో క‌లిసి ముద్దుల మోత మోగించ‌డ‌మే కాక‌.. బోల్డ్ సీన్లు చేసింది దీపికా.

ఆమెకు ఆల్రెడీ ర‌ణ్వీర్ సింగ్‌తో పెళ్ల‌యిన సంగ‌తి తెలిసిందే. వివాహానంత‌రం సినిమాలు కాస్త త‌గ్గించి, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తున్న దీపికా ఈ చిత్రంలో మాత్రం చాలా బోల్డ్‌గా న‌టించింది. పెళ్లయిన క‌థానాయిక ఇంత బోల్డ్ సీన్లు చేయ‌డ‌మేంటి అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతూ సోష‌ల్ మీడియాలో దీపిక‌ను విమ‌ర్శిస్తున్నారు కూడా. కానీ ఇలాంటి కామెంట్లు వ‌స్తాయ‌ని తెలిసే దీపికా ఈ క్యారెక్ట‌ర్‌ను ఓకే చేసి ఏ హ‌ద్దులూ పెట్టుకోకుండా న‌టించిన‌ట్లుంది. ఈ విష‌యంలో ట్రెండ్ సెట్ చేసిన దీపిక‌పై ప్ర‌శంస‌లు కూడా కురుస్తున్నాయి.