టాటా-టాటా: తొలి ప్రేమ ఎఫెక్ట్‌.. జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగానే!

తొలి అడుగు మంచిగా ప‌డితే.. జీవితాంతం మెరుగైన అడుగులే ప‌డతాయి. కానీ, తొలి అడుగులో త‌ప్పుదొర్లితే..?! అదే ర‌త‌న్ టాటా జీవితాన్ని.. జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగా ఉండేలా చేసేసింది. వేల కోట్ల రూపాయ‌ల సామ్రాజ్యానికి అధిప‌తి.

ఆయ‌న పిల‌వ‌కుండానే బారులు తీరి.. మా పిల్ల‌నిస్తాం.. మా పిల్లినిస్తాం.. అని ప‌రుగులు పెట్టి క్యూక‌ట్టే.. కుటుంబాలు ఎన్నో..! అయినా.. ర‌త‌న్ టాటా.. అవివాహితులుగా ఉండిపోయారు. అంతేకాదు.. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అత్యంత స‌న్నిహితుల‌కు మాత్ర‌మే చెప్పుకొన్నారు. నిజానికిర‌త‌న్ టాటాను చూస్తే.. ఆయన‌కు చాలా పెద్ద కుటుంబం ఉంటుంద‌ని అంద‌రూ అనుకుంటారు.

కానీ, వాస్త‌వానికి ర‌త‌న్ టాటా.. జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగానే మిగిలిపోయారు. దీనికి కార‌ణం.. తొలి ప్రేమ‌లో ఎదురైన చేదు అనుభ‌వం. స్పుర‌ద్రూపి, ఒత్త‌యిన జుత్తు, ఎక్స‌ర్‌సైజ్ బాడీ, సిక్స్ ప్యాక్‌.. చెబుతుంటేనే మ‌నిషిని ఊహించుకుంటే ఎలా ఉంటాడు? మ‌రి చూస్తే.. ఎవ‌రికి మాత్రం మ‌న‌సురాదు.

అయినా.. కుటుంబ నేప‌థ్యాన్ని.. త‌న తండ్రి,తాత‌లు ఈ దేశానికి అందించిన సేవ‌ల‌ను మ‌న‌నం చేసుకునే ర‌త‌న్ టాటా ఏనాడూ దారి త‌ప్ప‌లేదు. కానీ, యుక్త వ‌య‌సులో టాటా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక మహిళతో ప్రేమలో పడ్డారు. అది పెళ్లి వరకు కూడా చేరుకుంది. కానీ, అక్క‌డే సినిమాటిక్‌గా కీల‌క మ‌లుపు తిరిగింది.

అమెరికాలో ఉన్న స‌మ‌యంలో ముఖ్యంగా ప్రేమ‌లో నిండా మునిగిపోయిన స‌మ‌యంలో ఓ రోజు టాటాకు టెలిగ్రామ్ అందింంది. “అనారోగ్యంతో ఉన్న మీ అమ్మమ్మకు తోడుగా ఉండేందుకు త‌క్ష‌ణ‌మే రా” అంటూ.. ఆర్ జేడీ టాటా క‌బురు పెట్టారు. దీంతో ర‌త‌న్‌ టాటా వెంటనే భారతదేశానికి తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. ఇదే.. ఆయ‌న జీవితాన్ని మ‌లుపు తిప్పింది. రతన్ భారతదేశానికి వ‌చ్చాక‌.. త‌న ప్రేమికురాలిని త‌ర్వాత‌.. తీసుకురావాల‌ని భావించారు. కానీ, ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీక‌రించ‌లేదు.

దీనికి వారు చెప్పిన కార‌ణం.. “1962 ఇండియా-చైనా యుద్ధం” దీనిని ఉటంకిస్తూ వారు భార‌త్‌కు త‌మ కుమార్తెను పంపించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో ర‌త‌న్ ప్రేమ విఫ‌ల‌మైంది. కానీ, ఆయ‌న ప్రియురాలికి క‌బుర్ల‌పై క‌బుర్లు చేసినా.. ఆమె త‌ల్లిదండ్రులు సుత‌రామూ భార‌త్కు త‌మ కుమార్తెను పంపించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.

దీంతో టాటా జీవితాంతం అవివాహితులుగానే మిగిలిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న ఆ జ్ఞాప‌కాల్లోనే జీవించారు త‌ప్ప‌.. వేరేవారి వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఎంతో సంప‌ద ఉన్నా..మందీ మార్బ‌లం ఉన్నా.. ఎన్న‌డూ.. ఈ విష‌యాన్ని టాటా వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.