సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఆయన్ని మించిన ఆకర్షణ వేరే ఇంకేదీ అవసరం లేదు. కానీ ఆయన కొత్త చిత్రాల్లో మాత్రం దర్వకులు వేరే ఆకర్షణల్ని బాగానే దట్టిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ‘వేట్టయాన్’తో పాటు ఆ తర్వాత రానున్న ‘కూలీ’ సినిమామాల్లో కాస్టింగ్ చూస్తే మల్టీస్టారర్ తరహాలో కనిపిస్తున్నాయి.
‘వేట్టయాన్’లో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఇక ‘కూలీ’లో ఏమో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి పేరున్న నటులున్నారు. రజినీతో నాగ్, ఉపేంద్రల కలయికను అస్సలు ఎవ్వరూ ఊహించి ఉండరు.
నాగ్ ఇలాంటి ప్రత్యేక పాత్రలు పోషించడం మామూలే కానీ.. ఉపేంద్ర ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. ఐతే సూపర్ స్టార్ సినిమా అన్న ఏకైక కారణంతో కథ కూడా వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర చెప్పాడు.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనకు ఫోన్ చేసి రజినీకాంత్ సినిమాలో నటించాల్సి ఉంటుందని చెప్పాడని.. అలాగే సినిమా లైన్ చెప్పి తన పాత్ర గురించి వివరించబోతుంటే.. తాను ఆపేశానని ఉపేంద్ర తెలిపాడు. తాను రజినీకాంత్‌కు చాలా పెద్ద ఫ్యాన్ అని.. అలాంటపుడు కథ, పాత్ర గురించి చెప్పడం ఎందుకు, ఈ సినిమా చేస్తున్నా అంటూ ఆపేశానని ఉపేంద్ర చెప్పాడు.
రజినీ సినిమాలో నటించడం కంటే అదృష్టం, ఆనందం ఇంకేమీ ఉండదని.. అందుకే ఈ సినిమా కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నానని ఉపేంద్ర వెల్లడించాడు. ఉపేంద్ర ఇలా తెలుగులో రెండు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించాడు.
సన్నాఫ్ సత్యమూర్తితో పాటు గని మూవీలో నటించాడు. కానీ అవి నిరాశపరిచాయి. మరి తమిళంలో, అది కూడా సూపర్ స్టార్ మూవీలో చేస్తున్న ప్రత్యేక పాత్రతో ఉపేంద్ర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.