‘ప‌ర్స‌న‌ల్’ చంపేస్తోంది!: ఆర్బీఐ హెచ్చ‌రిక‌

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అప్పులు చేసేస్తున్నార‌ని.. ఇది ప్ర‌మాద‌క‌ర ధోర‌ణి అని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా(ఆర్బీఐ) హెచ్చరించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్‌.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు వ్య‌క్తిగ‌త రుణాలు(ప‌ర్స‌న‌ల్‌) చేసేస్తున్నార‌ని తెలిపారు. గ‌త 2022-23తో పోల్చితే.. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకున్న వారి సంఖ్య పెరుగుతోంద‌ని తెలిపారు. అయితే.. ఇది ప్ర‌మాద‌క‌ర ధోర‌ణిని సూచిస్తోంద‌న‌డం గ‌మ‌నార్హం.

ఎందుకిలా?

ఆర్బీఐ అంచ‌నా ప్ర‌కారం.. వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకోవ‌డం ప్ర‌మాక‌రం. ఎలా అంటే.. ప్ర‌స్తుతం చేస్తున్న ఉద్యోగం, ఉపాధిని అంచ‌నా వేసుకుని బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారులు ప‌ర్స‌న‌ల్ రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తు న్నారు. పైగా వ్య‌క్తిగ‌త రుణాల‌కు ఎలాంటి ప‌త్రాలు, ప్రూఫులు లేక‌పోవ‌డం వినియోగదారుల‌కు క‌లిసి వ‌స్తోంది. అయితే.. ఇక్క‌డే పెద్ద మ‌త‌ల‌బు ఉంది. వ్య‌క్తిగ‌త రుణాల రూపంలో ఇచ్చే మొత్తాల‌పై 42 – 50 శాతం వ‌డ్డీలు వ‌సూలు చేస్తున్నారు. నేష‌న‌లైజ్డ్ బ్యాంకుల్లోనే 35 శాతం వ‌డ్డీ విధిస్తున్నారు.

అయితే..వ‌డ్డీ ఎంత‌నేది ప‌క్క‌న పెడితే.. త‌క్ష‌ణం డ‌బ్బులు చేతికి అందుతుండ‌డంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున ఈ ప‌ర్స‌న‌ల్ రుణాల‌కు ఎగ‌బ‌డుతున్నారు. అయితే.. త‌ర్వాత కాలంలో వీటిని చెల్లించేందు కు నానా ప్ర‌యాస ప‌డుతున్నారు. కొంద‌రు వీటిని ఎగ్గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూ.. చిక్కుల్లో ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు. ఇత‌ర‌త్రా ఆస్తుల‌ను కూడా అమ్ముకుని వ్య‌క్తిగ‌త రుణాల‌ను చెల్లిస్తున్నారు. ఇక్క‌డ ఆర్బీఐ చెబుతున్న మ‌రో కీల‌క విష‌యం సిబిల్ స్కోర్‌.

ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుని చెల్లించ‌క‌పోతే.. అది సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. దీంతో స‌ద‌రు వ్య‌క్తికి త‌దుపరి ఎక్క‌డా రుణాలు ద‌క్కే అవ‌కాశం కోల్పోతున్నారు. ప‌ర్స‌న‌ల్ లోన్‌ల‌కు అల‌వాటు ప‌డిన యువ‌త‌.. వాటిని స‌ద్వినియోగం చేయ‌డం లేద‌ని కూడా ఆర్బీఐ హెచ్చ‌రించింది. ప్ర‌స్తుతం ఇంటి, బంగారంపై రుణాల‌కంటే 150 శాతం ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ రుణాలు తీసుకునేవారి సంఖ్య ఉంటోంద‌ని శ‌క్తికాంత దాస్ చెప్పారు.