పిల్లలతో జర్నీ చేసే పేరెంట్స్ కు రైల్వే మంత్రి స్వీట్ న్యూస్

తన రూపాన్ని మార్చుకుంటోంది భారతీయ రైల్వే. కాకుంటే.. సంక్షేమాన్ని వదిలేసి.. వసతుల పేరుతో సామాన్యులకు భారంగా మారుస్తూ నిర్ణయాలు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. పెద్ద వయస్కులు.. అందునా అరవై దాటిన వారికి ఇచ్చే ప్రయాణ రాయితీని కరోనా నుంచి తీసేసిన మోడీ సర్కారు.. ఈ రోజుకు దాన్ని పునరుద్దరించలేదు. అదే సమయంలో వందే భారత్ ట్రైన్లను తెర మీదకు తీసుకొచ్చి.. రైలు ప్రయాణాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేసింది. ఈ మధ్యన రైళ్లలో సౌకర్యాల పరంగా పెరగటం వరకు బాగానే ఉన్నా.. టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండటం ఇబ్బందికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. రైళ్లలో పిల్లలతో కలిసి ప్రయాణించే వారందరికి గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ట్రైన్ కోచ్ లలో బేబీ బెర్తులను అమర్చే అంశాన్ని వెల్లడించారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీ ఎంపీ సమర్ సింగ్ సోలంకీ ఒక ప్రశ్నను సంధించారు. రైళ్లలో బేబీ బెర్తులను అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా? అని ప్రశ్నించగా.. అవునన్న విషయాన్ని చెబుతూ.. “లక్నో మొయిల్ లో రెండు బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చాం. లక్నో మొయిల్ లోని ఒక కోచ్ లో రెండు దిగువ బెర్తులకు బేబీ బెర్తుల్ని అమర్చాం. దీనిపై వచ్చిన ఫీడ్ బ్యాక్ లో ప్రశంసలు దక్కాయి. అయితే.. ఈ సౌకర్యం కారణంగా సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవటం.. సీట్ల మధ్య దూరం తగ్గటం లాంటి సమస్యలను గుర్తించాం” అని పేర్కొన్నారు.

ప్రయాణికులు జర్నీ చేసే కోచ్ లలో మార్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయన్న ఆయన.. ఇదో నాన్ స్టాప్ వ్యవహారంగా పేర్కొన్నారు. బేబీ బెర్తుల విషయానికి వస్తే.. పిల్లల కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. వీటిని లోయర్ బెర్తుల్లో అమర్చారు. ప్రయాణ సమయంలో పిల్లలు.. తల్లులు ఒకే బెర్తు మీద సర్దుకొని పడుకోవటం కష్టంగా మారింది. దీనికి పరిష్కారంగా బేబీ బెర్తుల కాన్సెప్టును తీసుకొచ్చారు. కాకుంటే.. ప్రయోజనాలతో పాటు పాట్లు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో.. మరింత జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బేబీ బెర్తులు అన్ని రైళ్లలో ఎప్పటికి అందుబాటులోకి తీసుకొచ్చారో చూడాలి.కాకుంటే.. ఈ వసతి మాత్రం తల్లిదండ్రులకు వరంగా మారుతుందని చెప్పక తప్పదు.