Trends

సమీక్ష – బడ్డీ

అల్లు లాంటి పెద్ద కుటుంబం అండదండలు ఉన్నా సినిమాలు చేయడంలో నెమ్మదితనం పాటిస్తున్న శిరీష్ కొంత గ్యాప్ తర్వాత బడ్డీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేయడంతో క్రమంగా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఈ మూవీకి టికెట్ రేట్లు తగ్గించి మరీ జనాన్ని మొదటి రోజు థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. సామ్ అంటోన్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చైల్డ్ ఎంటర్ టైనర్ ఇంత పోటీ మధ్య నెగ్గుకొచ్చేలా ఉందో లేదో చూద్దాం.

కథ

హాంగ్ కాంగ్ లో ఉండే డాక్టర్ అర్జున్ (అజ్మల్) మనుషుల అవయవాలతో వ్యాపారం చేస్తుంటాడు. ఆ దేశపు మాఫియా డాన్ కొడుక్కి గుండె అవసరం పడటంతో అతనికి మ్యాచ్ అయ్యే హార్ట్ వైజాగ్ లో ఉండే పల్లవి (గాయత్రి భరద్వాజ్) దని తెలుసుకుని ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు. ఈ క్రమంలోనే ఆమె అల్లారుముద్దుగా చూసుకునే టెడ్డి బేర్ కు ఊహించని శక్తులు వస్తాయి. దీన్ని ఛేదించే క్రమంలో ఒకప్పుడు ఆమె ఇష్టపడిన సస్పెండెడ్ పైలట్ ఆదిత్య (అల్లు శిరీష్) ఆ బొమ్మకు అండగా నిలబడేందుకు సిద్ధపడతాడు. చాలా ప్రమాదకరమైన ఈ వలయం నుంచి ఒకప్పటి ప్రియురాలిని ఆదిత్య ఎలా కాపాడుకున్నాడనేదే తెరమీద చూడాల్సిన స్టోరీ

విశ్లేషణ

వినడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చిన్న పిల్లలను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం చాలా కష్టం. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్ నుంచి యానిమే సిరీస్ దాకా కొన్ని వందల వేల ఆప్షన్లు వినోదం అందించేందుకు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి కనక. సో వాటిలో లేనిది లేదా వాటిని తలదన్నేది ఉంటేనే ఆ వర్గాన్ని టికెట్లు కొనేలా చేయగలం. దర్శకుడు సామ్ అంటోన్ ఈ ప్రాధమిక విషయాన్ని మర్చిపోయి బడ్డీని రాసుకున్నాడనిపిస్తుంది. ఇలాంటి వాటిలో లాజిక్స్ అక్కర్లేదు. మేజిక్ జరిగితే చాలు ఎంజాయ్ చేయొచ్చు. అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అందుకే అలరించాయి. సో తర్కం అక్కర్లేదు.

కానీ ఎంగేజ్ చేసే కంటెంట్ అవసరం. బడ్డీలో ఇదే లేదు. టైటిల్స్ తర్వాత నేరుగా విలన్ ఎంట్రీతో మొదలుపెట్టి ఆపై హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, వాళ్ళు విడిపోవడానికి గల నేపధ్యం ఇవన్నీ సెట్ చేసుకున్న సామ్ అంటోన్ ఇవన్నీ మరీ రొటీన్ స్టైల్ లో తీర్చిదిద్దడమే కాక ప్రాక్టికల్ గా అనిపించని ఎపిసోడ్స్ తో అనవసరమైన సాగతీతని ఫస్ట్ హాఫ్ లోనే చూపించాడు. విమానాలు ల్యాండవుతున్నప్పుడు ఆఫీస్ లో పని చేసే సిగ్నల్ ఆపరేటర్స్ పైలట్లతో కమ్యూనికేట్ చేసే విధానం ఎలా ఉంటుందో సరైన అవగాహన లేకుండా పల్లవి వల్ల ఆదిత్య సస్పెండ్ అయిన క్రమాన్ని చూపించిన తీరు అపరిపక్వ రాతకు నిదర్శనం. కొంచెమైనా ఆడియన్స్ కి నమ్మశక్యంగా ఉండాలి కదా.  

సరే ఇదంతా పోన్లే అని క్షమిద్దామనుకుంటే బడ్డీ బొమ్మకి ప్రాణం వచ్చాక దానితో చేయించే పనులు మరీ ప్రాధమిక స్థాయిలో ఉండి ఇటు నవ్వించలేక ఇటు మెప్పించలేక పడరాని పాట్లు పడ్డాయి. బ్రతికున్న హీరోయిన్ ఆత్మ ఆ బొమ్మలో ఎలా ప్రవేశిస్తుందనే ప్రశ్నకు సామ్ చూపించిన సమాధానం ఎంత మాత్రం సహేతుకంగా లేదు. ముందే చెప్పుకున్నట్టు లాజిక్స్ పక్కన పెట్టినా ఆదిత్య, బడ్డీలు హాంగ్ కాంగ్ వెళ్లే వైనం, అలీ, సెకండ్ హీరోయిన్ మొత్తం నలుగురు కలిసి అర్జున్ ని చేరుకోవడం దాకా మొత్తం అనాసక్తంగా సాగుతుంది. బ్లాక్ బస్టర్ సినిమాల రిఫరెన్సులు ఎక్కడిక్కడ బాగానే వాడినా జీవం లేని కథనంకి బలం అందించేందుకు అవి ఏ మాత్రం ఉపయోగడపడలేదు.

అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం తమిళంలో వచ్చిన ఆర్య టెడ్డికే మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఈ బడ్డీని తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఎంత జుత్తు పీక్కున్నా అర్థం కాదు. ఒక మరబొమ్మతో ఎమోషన్ ని ఎంత గొప్పగా పండించవచ్చో రోబోలో శంకర్ నిరూపించాడు. క్లైమాక్స్ లో దాని భాగాలు విడదీసినప్పుడు మనకూ బాధ కలుగుతుంది. బడ్డీలో కూడా అలాంటి భావోద్వేగానికి స్కోప్ ఉన్నా డైరెక్టర్ వాడుకోలేదు. ఒక చిన్న పిల్లాడి చావు, వాడికి బడ్డీకి ఉన్న కనెక్షన్, ప్రాణం ఉన్నా బొమ్మలా తిరగాల్సి వచ్చిన పల్లవి ఆవేదన ఇవేవి మనల్ని తాకవు సరికదా అంతకంతా చిరాకు పెట్టించేలా సాగుతాయి. పబ్బు ఫైట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

సృజనాత్మకత కేవలం కాన్సెప్ట్ లో ఉంటె సరిపోదు. ఎగ్జిక్యూషన్ (అమలు) లో కూడా ఉండాలి. అప్పుడే సినిమాలు బాగుంటాయి. లేకపోతే బడ్డీ లాగా ఉడికీ ఉడకని గుడ్డులాగా అసంతృప్తిని కలిగిస్తాయి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్థాయి ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న తరుణంలో బడ్డీ లాంటి ప్రయోగాలు అవసరమే. కానీ రెండు గంటల ఇరవై నిమిషాల పాటు కట్టిపడేసేలా ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారని గుర్తు పెట్టుకోవాలి. లేదంటే లైట్ తీసుకుంటారు. అందులోనూ శిరీష్ లాంటి స్ట్రగులింగ్ హీరోలతో ఎక్స్ పెరిమెంట్లు చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. కానీ సామ్ అంటోన్ అంత సీరియస్ గా లేడు. దీంతో బడ్డీ మిడిల్ కన్నా ముందే డ్రాపయ్యింది

నటీనటులు

అల్లు శిరీష్ డీసెంట్ గా ఉన్నాడు. తనకిచ్చిన పాత్ర కోరే పెర్ఫార్మన్స్ ని నీట్ గా ఇచ్చాడు. ఎక్కువ ఫోకస్ బడ్డీ మీదే ఉంటుంది కాబట్టి ఛాలెంజనిపించే అవసరం తనకు పడలేదు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడింది, కనిపించింది రెండూ తక్కువే. సో ప్రస్తావన కూడా అంతే. ప్రిషా రాజేష్ సింగ్ కు కాసిన్ని ఎక్కువ సీన్లు పడ్డాయి కానీ ఓకే. అజ్మల్ కు ఇలాంటి క్యారెక్టర్లు కొత్తేమి కాదు. రెగ్యులర్ టెంప్లేట్ లో చేసుకుంటూ పోయాడు. ఈ మధ్య కనిపించడం తగ్గించేసిన ముఖేష్ ఋషిని సాఫ్ట్ గా చూపించినా ఎక్కువ బిల్డప్ ఇచ్చారు. టి షర్ట్, షార్టుతో లాగించేశారు. కమెడియన్ అలీ జోకులు పేలలేదు. వీళ్ళు తప్ప పెద్దగా చెప్పుకునే క్యాస్టింగ్ ఏమి లేదు.

సాంకేతిక వర్గం

ధృవ, కృష్ణార్జున యుద్ధం లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేసిన హిప్ హాప్ తమిజ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు పర్వాలేదనిపిస్తుంది. పాటలు ఎక్కువ పెట్టకపోవడం రిలీఫ్. ఉన్నవీ మైనస్సే. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ బాగా ప్రెజెంట్ చేశాడు. సిజి షాట్స్ సహజంగా వచ్చేలా చేయడంలో ఈయన పనితనం కనిపిస్తుంది. రూబెన్ ఎడిటింగ్ నిడివిని ఇంకొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. ఫైట్స్ లెన్త్ ఎక్కువనిపిస్తుంది. సాయి హేమంత్ సంభాషణల్లో ఎలాంటి మెరుపులు లేవు. విఎఫెక్స్ ఎఫెక్ట్స్ గొప్పగా చెప్పుకునేలా కాదు కానీ మరీ తీసిపారేసే బాపతు కాదు. నిర్మాణ విలువలు డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు స్టూడియో గ్రీన్.

ప్లస్ పాయింట్స్

కాన్సెప్ట్ కొత్తదే
కొన్ని బడ్డీ పనులు

మైనస్ పాయింట్స్

ఆసక్తి కలిగించని కథనం
తేలికైన సన్నివేశాలు
జీరో ఎమోషన్
సిల్లీ రైటింగ్

ఫినిషింగ్ టచ్ : విరిగిపోయిన బొమ్మ

రేటింగ్ : 2 / 5 

This post was last modified on August 2, 2024 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిచ్చగాడు హీరోకి ఇంత రిస్క్ ఎందుకబ్బా

ఎప్పుడో బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఆ తర్వాత మళ్ళీ హిట్టు మొహం చూసింది దాని సీక్వెల్…

43 mins ago

రాక్షసరాజుని వదలనంటున్న రానా

నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ ఫుల్ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ…

2 hours ago

దావూది పాట మీద తర్జనభర్జనలు ?

వచ్చే వారం విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానుల ఎదురుచూపులు అంతకంత భారంగా మారిపోయాయి. ఎప్పుడెప్పుడు ఏడు…

3 hours ago

దసరా కాంబో.. డౌటేం లేదు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి ఊపు మీదున్నాడు. 15 నెలల వ్యవధిలో అతను మూడు సక్సెస్‌లు అందుకున్నాడు. గత…

4 hours ago

టెన్షన్‌గా ఉందన్న ఎన్టీఆర్

ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అంటే.. ‘దేవర’నే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ…

5 hours ago

కంగువ.. వేరే దారి లేదు మరి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం.. కంగువ. ఇప్పటిదాకా రొటీన్ మాస్ మసాలా…

6 hours ago