సమాజం మారిపోయింది, అభ్యుదయం పెరిగిపోయిందని కబుర్లు చెప్పుకుంటాం కానీ నిజానికి ఈ 5జి ప్రపంచంలోనూ కుల వివక్ష బోలెడంత ఉంది. దానికి ఉదాహరణే ఈ సంఘటన.
ఇటీవలే తమిళంలో గరుడన్ రిలీజయ్యింది. వడ చెన్నై, విచారణ, విడుదల పార్ట్ 1 లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వెట్రిమారన్ దీనికి కథను అందించారు. సెంథిల్ కుమార్ దర్శకుడు. కమెడియన్ సూరి హీరోగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
గత ఇరవై నాలుగు గంటల్లో ఇండియా వైడ్ లక్షకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోయిన సినిమా ఇదొక్కటే. బాలీవుడ్, టాలీవుడ్ కొత్త మూవీస్ కాదు.
తమిళనాడులో సంచార జాతి అనే కులం ఒకటుంది. నక్కల జాతి అనే పేరుతో కూడా వ్యహరిస్తారు. ఊరూరా తిరిగి వంట సామాన్లు అమ్మడం ద్వారా జీవనోపాధి చూసుకుంటారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లడం వీళ్ళ అలవాటు.
శనివారం వ్యాపారం పూర్తి చేసుకుని కడలూరు అనే ఊరిలో గరుడన్ చూద్దామని మొత్తం 30 మంది థియేటర్ కు వెళ్లారు. వీళ్ళను చూసిన యాజమాన్యం టికెట్లు అమ్మడానికి నిరాకరించి వెనక్కు వెళ్లిపోవాలని చెప్పింది. దీంతో ఆగ్రహించిన సంచార జాతి ప్రేక్షకులు తీవ్ర నిరసన ప్రకటించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి, అక్కడ పని జరగక ఆర్డిఓని కలుసుకుని నేరుగా తమకు జరిగిన అన్యాయం వివరించారు.
వెంటనే థియేటర్ దగ్గరకు వెళ్లిన అధికారులు దగ్గరుండి టికెట్లు ఇప్పించి ఆ బృందం సభ్యులందరికీ సినిమా చూసే ఏర్పాట్లు చేశారు. తక్కువ కులం కాబట్టి ఇతర వర్గాల నుంచి ఏమైనా గొడవలు జరగొచ్చనే అనుమానంతో 20 మంది పోలీసులతో బందోబస్తు పెట్టించి షో అయిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా కాపలా ఉన్నారు. నిజంగా ఇది ఆందోళన కలిగించే సంఘటన.
ఒకరో ఇద్దరో వెళ్లి ఉంటే ఇలా జరిగేది కాదేమో కానీ ఒక సమూహంగా వెళ్లిన వాళ్ళను కులం పేరుతో అడ్డుకోవడం మాత్రం ముమ్మాటికీ దుర్మార్గమే. ఇలాంటి దారుణాల మీదే కథలు రాసే వెట్రిమారన్ ఈ ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.