బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముకేశ్‌ కుమార్‌(28) బెట్టింగ్‌, జల్సాలకు అలవాటుపడ్డాడు. బెట్టింగ్‌లో ముకేశ్‌ ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టాడు.

ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు మృతి చెందాడు. ముకేశ్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేశాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలో బెట్టింగ్ యాప్ ల కారణంగా యువత తమ ప్రాణాలను కోల్పోతున్నది. అనేక మంది యువత వీటి బారినపడి ఆస్తులతో పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నది.