ఇప్పటి జనరేషన్ కి అవగాహన లేదు కానీ న్యూస్ రీడర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శాంతి స్వరూప్ మరణ వార్త మీడియాలో హైలైట్ కావడం చూసి ఆశ్చర్యపోయే ఉంటారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ హైదరాబాద్ లో తుదిశ్వాస తీసుకున్న ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటే గొప్పదనం అర్థమవుతుంది. శాంతి స్వరూప్ దూరదర్శన్ ఛానల్ లో 1983లో వార్తలు చదివే యాంకర్ గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. చెప్పాలంటే తెలుగులో మొట్టమొదటి వీడియో వ్యాఖ్యాత ఈయనే. తొలినాళ్లలో ఎంతో సవాలుతో కూడుకున్న జాబ్ ఇది.
అప్పట్లో టెక్నాలజీ, రకరకాల ఛానల్స్ ఉండేవి కాదు. దూరదర్శన్ మాత్రమే పరిమితంగా ప్రసారాలు చేసేది. రోజు సాయంత్రం 7 గంటలకు వచ్చే వార్తల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాలంతా టీవీలకు అతుక్కుపోవడం అతిశయోక్తి కాదు. స్పష్టమైన ఉచ్చారణతో, ఎలాంటి దోషాలు లేకుండా ప్రసన్న వదనంతో శాంతి స్వరూప్ వార్తలు చదివే విధానం ఆయనకు అభిమానులకు సంపాదించి పెట్టింది. రోజూ కేంద్రం నుంచి వచ్చే పది పేజీల ఇంగ్లీష్ రిపోర్ట్ ని తెలుగులో స్వయంగా తర్జుమా చేసుకుని తప్పులు లేకుండా చదవడం చూసి అధికారులు ఆశ్చర్యపోయేవారు.
2011 వరకు శాంతి స్వరూప్ దూరదర్శన్ లోనే కొనసాగారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ఆ వార్తలు చదవడం తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాలుగా ఆయన చెప్పుకుంటారు. ఎన్టీఆర్ కాలం చేసినప్పుడు సైతం తీవ్ర ఆవేదనను అణుచుకుని జనాలకు వార్తలు వినిపించడం సవాల్ గా భావించానని చెబుతారు. కొన్ని ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. వీలైనంత ఓవర్ ఫోకస్ కి దూరంగా ఉండే శాంతి స్వరూప్ 80, 90 దశకంలోని పిల్లలు, యూత్ తో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడా జ్ఞాపక స్వరం స్వర్గానికి వెళ్లిపోయింది.