అంటే ఇంకో ఆర్నెల్లు కరోనాతో సహజీవనమే

కరోనా వ్యాక్సిన్ ఇదిగో వచ్చేస్తోంది అదిగో వచ్చేస్తోంది అని ప్రభుత్వ వర్గాలే ఊరించాయి. ఆగస్టు 15న స్వాంతంత్ర్య దినోత్సవానికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుందని కొన్ని నెలల కిందట గొప్పలు పోయారు. కానీ ఈ ఏడాది చివరికి కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆ దిశగా ఎలాంటి సంకేతాలూ అందడం లేదు. ఏ వ్యాధికైనా వ్యాక్సిన్ తయారు చేయడం అన్నది కొన్నేళ్ల పాటు సాగే ప్రక్రియ.

కరోనా తీవ్రత దృష్ట్యా పరిశోధనలు, అనుమతుల వేగం ఎంతగా పెంచినప్పటికీ.. వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి కనీసం ఏడాది సమయం అయినా పడుతుందని నిపుణులు అంటూనే ఉన్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు వ్యాక్సిన్ తయారీ దారులు ప్రజల్లో ఆశలు కల్పించారు. కానీ ఆ ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.

ఇప్పుడు వాస్తవం బోధపడేసరికి కేంద్ర ప్రభుత్వం తీరు మారినట్లు స్పష్టమవుతోంది. ప్రజలకు ఇంకా ఆశలు రేకెత్తించకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే మాటలు మాట్లాడారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి రావడానికి ఇంకా ఆరు నెలలకు పైగానే సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చ 31 నాటికి వ్యాక్సిన్ ప్రజల్ని చేరే అవకాశముందంటూ ఆయన కొత్త డెడ్ లైన్ ప్రకటించారు.

స్వయంగా కరోనా బారిన పడి కోలుకున్న హర్షవర్ధన్.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ముందుగా దాన్ని పరీక్ష కోసం తీసుకోవడానికి వాలంటీర్‌లా వ్యవహరించడానికి తాను సిద్ధమని తెలిపారు. ఆ సంగతలా ఉంచితే.. ఇప్పటికే కరోనాకు బాగా అలవాటు పడిపోయిన జనం.. కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటనను బట్టి చూస్తే ఇంకో ఆరు నెలల పాటు ఆ వైరస్‌తో సహజీవనానికి సిద్ధం కావాల్సిందే అన్నమాట. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న స్వదేశీ వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’తో పాటు కొన్ని విదేశీ వ్యాక్సిన్లను కూడా భారత్‌లో అందుబాటులోకి తేవడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

All the Streaming/OTT Updates you ever want. In One Place!