కరోనా వచ్చి వెళ్లిపోగానా చాలా రిలాక్స్ అయిపోతుంటారు జనాలు. కరోనా రాకముందు, వచ్చాక ఉన్న భయం, ఆందోళన అంతా పక్కకు వెళ్లిపోతాయి. వైరస్ వచ్చి వెళ్లిపోయింది. ఇక మనకేం కాదు అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది అంత మంచిది కాదు అంటోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈమేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని ఆ శాఖ వెల్లడించింది. దీనిపై ఎక్కువ ఆందోళన అవసరం లేదంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది.
ఎప్పటిలాగే మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలని సూచించింది.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్‌తో పోరాటంలో శరీరం బలహీనపడుతుంది కాబట్టి వేరే ఇబ్బందులు రాకుండా.. మరోసారి వైరస్ బారిన పడకుండా ఈ జాగ్రత్తలన్నీ పాటించాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.