ఒకే వేదిక‌ పై రేవంత్‌-ష‌ర్మిల‌.. ఆ ఉత్సాహ‌మే వేర‌ప్పా!

కాంగ్రెస్ పార్టీలో ఆ ఉత్సాహ‌మే వేర‌ప్పా! అనే టాక్ వినిపించింది. దీనికి కార‌ణం విశాఖ‌లో ఒకే వేదిక‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల క‌నిపించ‌డ‌మే. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ పేరుతో కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ఏపీ నాయకులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సభావేదిక మీదికి వచ్చిన సమయంలో ఏపీ కాంగ్రెస్ కేడర్ చ‌ప్ప‌ట్లు చ‌రుస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. వేదిక మీదకు వచ్చిన రేవంత్ రెడ్డి… తనతో పాటు షర్మిల చేయిని కూడా పైకెత్తి సభకు వచ్చిన వారికి అభివాదం చేశారు.

ష‌ర్మిల కామెంట్స్‌..

ప్రత్యేక హోదా డిమాండ్ 2019 ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లిన జగన్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ష‌ర్మిల అన్నారు. పదేళ్లుగా ఏ నాయకుడు రాష్ట్రాన్ని పట్టించుకోలేదని, ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్ర‌ధాని మోడీ మోసం చేశారని విమ‌ర్శించారు. ప్రత్యేక హోదాపై మోడీని ఏనాడైనా జగన్ గట్టిగా నిలదీశారా? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్నను చంపినవారిని రక్షించాలని అడిగేందుకు మాత్రం ఢిల్లీ వెళుతున్నారని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిచంఆరు.

“నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయతీ ఉంది. నా పుట్టింట్లో అన్యాయం జరుగుతోంది కాబట్టి ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేంతవరకు, పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంతరకు, విశాఖ ఉక్కును కాపాడుకునేంత వరకు, మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ్నించి కదలదు” అని షర్మిల పేర్కొన్నారు.