కోవాగ్జిన్ వాడిన జంతువుల పరిస్థితేంటి?

కరోనాతో అల్లాడిపోతున్న ఇండియా.. కోవాగ్జిన్ మీద చాలా ఆశలే పెట్టుకుంది. కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రయోగాల్లో మిగతా అన్ని కంపెనీల కంటే చాలా ముందంజలో ఉన్న భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరిది. రెండు నెలల కిందటే ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ మొదలైన సంగతి తెలిసిందే.

ముందు జంతువులకు, ఆ తర్వాత మనుషులకు ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూస్తున్నారు. మనుషుల మీద వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల గురించి వివరాలు వెల్లడి కాలేదు. ఐతే జంతువుల మీద మాత్రం కోవాగ్జిన్ చాలా బాగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ స్వయంగా వెల్లడించింది. జంతువులపై కోవాగ్జిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆ సంస్థ పర్కటించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్‌ వాడిన జంతువుల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం కలగలేదని భారత్ బయోటెక్ పేర్కొంది. రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించామని.. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని నియంత్రించినట్లు గుర్తించామని తెలిపింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని సంస్థ పేర్కొంది. మరి మనుషుల మీద వ్యాక్సిన్ ప్రభావం కూడా ఇదే స్థాయిలో ఉంటే.. గొప్ప ముందడుగు పడినట్లే.

ఆగస్టు 15కే కోవాగ్జిన్‌ను తీసుకొచ్చే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించారు కానీ.. అది సాధ్యం కాదని తేలిపోయింది. ఆ తర్వాత అక్టోబరు డెడ్ లైన్ పెట్టుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికి ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సైతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ టీకా మీద ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఆ వ్యాక్సిన్‌ను ఇండియాలో అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది.

All the Streaming/OTT Updates you ever want. In One Place!