ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో గార్డెన్ సిటీ బెంగళూరు మహానగరం నీటి ఎద్దడితో విలవిలలాడుతోంది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహానగరానికి ఇప్పుడు ఎదురైన నీటి సమస్య ఎంత ఎక్కువగా ఉందంటే.. మహానగరంలోని టెకీలంతా ఇంటి బాట పట్టేసి.. వర్కు ఫ్రం హోం మొదలు పెట్టేశారు. అపార్టుమెంట్లు ఇప్పుడు ఖాళీ అయిన పరిస్థితి. జనాబా రీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరంగా పేరున్నప్పటికీ.. అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు లేకపోవటం ఈ నగరానికి శాపంగా మారింది. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో దేశానికి ఐటీ రాజధానిగా పేరున్న ఈ నగరానికి ఇంతటి నీటి ఎద్దడి ఎందుకు? అసలు కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళ్లటానికి ముందు.. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిస్తే నోటి వెంట మాట రాదు.
ఇప్పటికే బెంగళూరులో వాహనాలను నీళ్లతో కడగటాన్ని నిషేధించారు. వారానికి ఒకసారి నీళ్లు వస్తున్న పరిస్థితి. బోర్లు ఎండిపోవటంతో దిక్కు తోచక నగరాన్ని తాత్కాలికంగా ఖాళీ చేసేసి వెళ్లిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీళ్లు తగ్గిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరి నుంచే షురూ అయ్యాయి. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. గత ఏడాది వర్షాలు తక్కువగా పడటంతో నీటి ఎద్దడి మరింత పెరిగింది.
ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బెంగళూరులో ఇప్పుడు నీళ్ల కటకట హాట్ టాపిక్ గా మారింది. ఈ మహానగరానికి రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లబిస్తోంది. కానీ.. మరో 168 కోట్ల లీటర్ల నీరు అవసరమంటే.. గ్యాప్ ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంత భారీగా నీరు ఎక్కడ లభిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్న. గత పాలకుల నుంచి ఇప్పటివరకు జరిగిన తప్పులు.. ప్రజల స్వార్థం మొత్తంగా బెంగళూరులో బతకటం నరకప్రాయంగా మారుస్తోంది.
1961లో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో 262 చెరువులు ఉంటే.. ఇప్పటికి వాటి సంఖ్య 81 మాత్రమే. వాటిల్లో జీవం ఉన్న చెరువులు కేవలం 33 మాత్రమే. అది కూడా జనావాసాలకు దూరంగా ఉండటంతో బతికిపోయాయి కానీ.. లేదంటే అవి కూడా ఖతమైపోయేవి. అందులోనూ 90 శాతం చెరువులు కాలుష్యం కారణంగా పనికి రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాలానికి తగ్గట్లుగా ప్రణాళికల్ని సిద్దం చేసుకోవటం.. మనిషి తనస్వార్థాన్యి తగ్గించుకొని.. పర్యావరణం మీద శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నీటి వనరుల కోసం ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోకుంటే.. బెంగళూరులో బతుకు నరకప్రాయం ఖాయమవుతుంది.