నోట్ల క‌ట్ట‌లు.. కిలోల కొద్దీ బంగారం: లేడీ ఆఫ్ కరప్షన్

గిరిజ‌నుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి వారి సేవ‌లో త‌రించాల్సిన ఓ మ‌హిళా అధికారి.. త‌న సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వ‌సూలు చేసుకున్నారు. స‌హ‌జంగా మ‌హిళా అధికారులు అంటే.. లంచాల‌కు, ప్ర‌లోభాల‌కు దూరంగా ఉంటార‌నే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్స‌యిన లంచావ‌తారానికి ప్ర‌తిరూపంగా నిలిచింది. సోమ‌వారం ఆమె కార్యాల‌యంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయ‌ల‌ను లంచంగా తీసుకుంటుండ‌గా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

కానీ, జ్యోతి మాత్రం.. క‌న్నీరు పెట్టుకుని.. తాను అడ‌గ‌క‌పోయినా.. లంచం ఇచ్చార‌ని.. ఆ సొమ్ముకు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. తాను చాలా నిజాయితీ ప‌రురాలిన‌ని, కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా త‌న‌పై ఫిర్యాదు చేసి.. త‌న ఉన్న‌తిని అడ్డుకుంటున్నార‌ని.. బోరున విల‌పించారు. దీంతో పాపం.. క‌దా.. అనే సానుభూతి వ‌చ్చింది. అయితే.. అస‌లు విష‌యం త‌ర్వాత తెలిసింది. ఏసీబీ అధికారులు ఆమె క‌న్నీటికి క‌రిగిపోకుండా.. ఇంటిని చుట్టుముట్టారు.

ఆమె ఇంట్లోసోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ క‌ట్ట‌ల కొద్దీ 500 నోట్లు క‌నిపించాయి. మంచం కింద‌.. బాత్ రూమ్ అల్మ‌రా, కిచెన్ స‌హా దేన్నీ ఆమె వ‌ద‌ల‌కుండా.. అన్నింటినీ బ్యాంకుగా మార్చేసి.. క‌ట్టలు కూరేసింది. అంతేకాదు.. కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లు, న‌గ‌లు.. కూడా ఉన్నాయి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెకు రిమాండ్ ఖైదు విధించింది.