ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడు ఇతడే

భారత్ లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన టోర్నీగా ఐపీఎల్ ఖ్యాతి గడిచింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం ఐపీఎల్ చుట్టూ జరగడంతో ప్రపంచ క్రికెట్లో ప్రతి ఆటగాడు ఐపీఎల్ లోని ఏదో ఒక జట్టుకు ఆడాలని భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక, ఐపీఎల్ తర్వాతే ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డుగా అవతరించింది. కోట్లు కుమ్మరించి మరి స్టార్ ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్లో ఆడబోయే ఆటగాళ్ల కోసం ఈ రోజు జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్ల రూపాయలకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ అవతరించాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడికి ఇంత పెద్ద మొత్తం చెల్లించలేదు. ఇక, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు పెట్టి ఖరీదు చేసింది. కివీస్ బ్యాటర్ డెరైల్ మిచెల్ ను సీఎస్కే 14 కోట్ల భారీ ధరకు కొనేసింది. ఇక, న్యూజిలాండ్ ఓపెనర్ రాచిన్ రవీంద్రకు భారీ ధర పలుకుతుందని ఆశించినా..చివరకు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని 1.80 కోట్లకు కొనేసింది. ఈసారి వేలంలో హర్షల్ పటేల్ జాక్ పాట్ కొట్టాడు. 11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతడిని సొంతం చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక, వరల్డ్ కప్ లో అదరగొట్టిన శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంకను 4.6 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

ఇటువంటి స్టార్ ప్లేయర్లనే కాకుండా సమీర్ రిజ్వీ వంటి అనామక క్రికెటర్లు కూడా ఈ వేలంలో మంచి ధర దక్కించుకున్నారు. శుభమ్ దూబే, కుమార్ కుశాగ్ర వంటి కొత్త ఆటగాళ్లకూ విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 20 లక్షల కనీస ధర ఉన్న సమీర్ రిజ్వీని 8.4 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ…ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ లో 9 ఇన్నింగ్స్ లు ఆడి 2 సెంచరీలతో 455 పరుగులు సాధించాడు. ఝార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుమార్ కుశాగ్ర కుమార్ కుశాగ్రను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల కుశాగ్ర దేవధర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు.