వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మన జట్టు ఓటమి పాలైంది.ఆస్ట్రేలియా కప్పు ఎగరేసుకుపోయింది. వన్డే కెరీర్లను ఘనంగా ముగించాలని చూసిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు నిరాశ తప్పలేదు. ఈ టోర్నీతోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఆయనకు కూడా ఆఖర్లో చేదు గుళిక తప్పలేదు.
ఐతే వన్డే కెరీర్లు ముగించబోతున్నట్లు రోహిత్, కోహ్లి అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. అలాగే ద్రవిడ్ కూడా ఇంతటితో తాను కోచ్‌గా దిగిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వీరి భవితవ్యంపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కానీ బీసీసీఐ వర్గాల ప్రకారం వీరి కథ ముగిసినట్లే అంటున్నారు.
రోహిత్, కోహ్లి కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోహిత్ వయసు 36 ఏళ్లు కాగా.. కోహ్లికి 35 ఏళ్లు నిండాయి. ఇంకో నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్ వరకు వీళ్లు కొనసాగడం కష్టం. ఆ టోర్నీలో ఆడనపుడు వన్డేలు ఆడటంలో అర్థం ఉండదు. పైగా ఈ రోజుల్లో వన్డేలు బాగా తగ్గిపోయాయి. ఆల్రెడీ వీళ్లిద్దరూ టీ20లకు దూరం అయ్యారు. ఏడాది గ్యాప్ వచ్చేసింది. జట్టును యువ ఆటగాళ్లతో నింపేస్తున్నారు. దీంతో ఇక మళ్లీ టీ20ల్లోకి పునరామగనం చేయడం కష్టమే. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్, కోహ్లి దూరమైనట్లే. ఓపిక ఉన్నంత వరకు టెస్టులు ఆడి రిటైరైపోవడమే అన్నమాట.
ఇక ద్రవిడ్ విషయానికి వస్తే.. అతడి పదవీ కాలాన్ని ఇంకో ఏడాది కొనసాగించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ద్రవిడ్‌కే ఇష్టం లేదట. కుటుంబంతో సమయం గడపడం కోసం కోచ్ పదవి వదిలేయాలనుకుంటున్నాడట. రెండు మూడు నెలలు మాత్రమే పని ఉండే ఐపీఎల్ కోచ్ పదవిని ద్రవిడ్ చేపట్టనున్నట్లు సమాచారం.