ఇలా అయితే ఐపీఎల్ ఎలా?

IPL

ఎప్పట్లా వేసవిలో కాకపోయినా.. కొంచెం ఆలస్యంగా అయినా ఐపీఎల్ చూడబోతున్నామని చాలా సంతోషంలో ఉన్నారు క్రికెట్ ప్రియులు. కానీ ఐపీఎల్ సజావుగా జరుగుతుందా లేదా అని ముందు నుంచి ఉన్న అనుమానాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తే ఆందోళనకరంగా ఉన్నాయి.

కరోనా ముప్పు పొంచి ఉన్నప్పటికీ బయో బబుల్ నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఇంగ్లాండ్‌లో ఒకటికి మూడు సిరీస్‌లను ఏ ఇబ్బందీ లేకుండా నిర్వహించారు. ఇదే రీతిలో ఐపీఎల్ కూడా జరిపించాలని బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుకున్నాయి. కానీ వాస్తవంలో ఇదంత తేలిక కాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇంకా అన్ని జట్లూ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టలేదు. ఇంతలోనే చెన్నై బృందంలో ఇద్దరు ఆటగాళ్లు సహా పది మందికి పైగా కరోనా బారిన పడ్డారు.యూఏఈలో జట్టలు అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఇక ప్రాక్టీస్ మొదలుపెడితే.. మ్యాచ్‌లు ఆడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అందులోనూ మూడు నగరాలకు ఆటగాళ్లు మారుతూ ఉండాలి. ఇటు అటు తిరుగుతూ ఉండాలి. ఇంగ్లాండ్‌లో రెండేసి జట్లు సిరీస్‌ల్లో తలపడ్డాయి కాబట్టి.. తక్కువమంది ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర వ్యక్తుల్ని కట్టుదిట్టంగా బబుల్‌లో ఉంచి మ్యాచ్‌లు నిర్వహించగలిగారు. కానీ ఐపీఎల్ అంటే ఎనిమిది జట్లతో ముడిపడ్డ టోర్నీ.

ఆటగాళ్లతో పాటు సిబ్బంది, అధికారులు, ఇతరులు కలిపితే వెయ్యి మంది దాకా ఉంటారేమో. పైగా వివిధ దేశాల నుంచి ఆటగాళ్లు వెళ్లి అక్కడ కలిశారు. ఈ నేపథ్యంలో కరోనా ముప్పును ఛేదించి మ్యాచ్‌లు విజయవంతంగా జరిపించడం కష్టంగానే అనిపిస్తోంది. ఇంకా ప్రాక్టీస్ మొదలు కాకముందే ఇంతమంది కరోనా బారిన పడితే.. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో.. వైరస్ మరీ విస్తరించే పరిస్థితి వస్తే టోర్నీ జరుగుతుందో లేదో అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. టోర్నీ ఆరంభానికి ఇంకో 20 రోజులే ఉండగా ఇప్పటిదాకా బీసీసీఐ షెడ్యూల్ కూడా ప్రకటించకపోవడం సందేహాలను మరింత పెంచుతోంది.