10 బంతుల్లో అర్ధసెంచరీ.. 34 బంతుల్లో సెంచరీ

ప్రపంచ క్రికెట్లో నేపాల్ జట్టు పసికూనే. కానీ ఆ పసికూనకు ఓ పసికూన దొరకడంతో ఒక మహా జట్టులా మారింది బుధవారం. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల క్రికెట్ టోర్నీ ఈ రోజే మొదలైంది. నేపాల్.. మంగోలియా జట్టుతో తలపడింది. మంగోలియా పేరు క్రికెట్లో ఇప్పటిదాకా ఎవరూ విని ఉండరు. ఈ మధ్యే అసోసియేట్ దేశాల జాబితాలోకి అడుగు పెట్టింది. అక్కడ పెద్దగా క్రికెట్ కల్చరే లేదు. ఏదో నామమాత్రంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగింది.

ఈ జట్టుతో మ్యాచ్‌లో నేపాల్ ఆటగాళ్లు మామూలుగా రెచ్చిపోలేదు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో, నమ్మశక్యం కాని రికార్డులు నెలకొల్పారు. నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ కేవలం 10 బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టి పడేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో 12 బంతులతో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ సాధించి నెలకొల్పిన రికార్డు బద్దలైంది.

మరో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాటర్ అయ్యాడు. అతను కేవలం 34 బంతుల్లోనే వంద కొట్టేశాడు. మొత్తంగా కుశాల్ 50 బంతుల్లో 137 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్ మిల్లర్ 35 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగులు సాధించగా.. మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది.

నేపాల్ ఏకంగా 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20ల్లో 273 పరుగుల తేడాతో గెలవడం అన్నది ఊహకైనా అందని విషయం. ఇది కూడా ప్రపంచ రికార్డు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టర్కీ జట్టు చెక్ రిపబ్లిక్ మీద 257 పరుగులతో నెగ్గిన రికార్డు బద్దలైంది. మొత్తంగా ఆసియా క్రీడల్లో ఈ మ్యాచ్ రికార్డుల కోసమే పెట్టినట్లు అయింది.