అసలు టీబీజేపీ ఏం  చేస్తోంది?

ఓ రాష్రంలో అధికారంలోకి రావాలంటే ఓ పార్టీకి ఎన్నో విషయాలు కలిసి రావాలి.  బలమైన అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాలి. ఆయా నియోజకవర్గాల గెలుపు కోసం కలిసొచ్చే సమీకరణాలు తెలుసుకోగలగాలి. ప్రచారాన్ని హోరెత్తించాలి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టే వ్యూహాలు రచించాలి. కానీ తెలంగాణ లో మాత్రం బీజేపీ ఈ కీలక సమయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. అక్టోబర్ లో షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల రేసులో ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం సమీప దూరంలో కనిపించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అధికార బీఆర్ఎస్ ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల వేడిని రాజేసింది. మరోవైపు జోరుమీదున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలోనే అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించబోతుంది. కానీ బీజేపీ మాత్రం ఈ విషయంలో తాత్సారం చేస్తోంది. టికెట్ల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నానా హడావుడి చేసింది. కానీ అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఎలాంటి కసరత్తు కనిపించడం లేదనే చెప్పాలి.

మరోవైపు చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. బీజేపీ మాత్రం ఈ విషయంలో ఏమీ పట్టనట్లుగానే ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. చేరికల విషయంలో ఈటల రాజేందర్ చొరవ తీసుకుంటున్న పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీలోనూ అంతర్గత విభేధాలు తారస్థాయికి చేరాయనే చెప్పాలి. ఇటీవల కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి తదితర నాయకులు వివేక్ ఇంట్లో రహస్యంగా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. మరి తెలంగాణలో గెలుపుపై బీజేపీ ఆశలు వదిలేసుకుందని, అందుకే అలసత్వం ప్రదర్శిస్తుందనే టాక్ వినిపిస్తోంది.