హడలెత్తించిన ఎలుక.. గోదావరి ఎక్స్ ప్రెస్ లో పొగలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలానే రైళ్లు నడిచినా.. విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. విశాఖపట్నం వెళ్లే వారు కానీ.. విశాఖ నుంచి హైదరాబాద్ వద్దామని అనుకునే వారు కానీ.. తొలుత వెతికేది గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో బెర్తు దొరుకుతుందా? అంటే అతిశయోక్తి కాదు. అంతలా కనెక్టు అయ్యే గోదావరి ఎక్స్ ప్రెస్ లో తాజాగా ప్రయాణికులు హడలిపోయే ఉదంతం చోటు చేసుకుంది.

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న గోదావరి (ట్రైన్ నెంబరు 12728)ఎక్స్ ప్రెస్ లోని ఏసీ కోచ్ నుంచి పొగలు రావటంతో ప్రయాణికులు టెన్షన్ పడిపోయారు. అనూహ్యంగా వస్తున్న పొగలతో ఒక్కసారిగా హడలిపోయిన వారు.. కాసేపటికి హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నారు. ఖమ్మం – విజయవాడ మధ్యలోని బోనకల్ స్టేషన్ వద్ద ఏసీ బోగీలోని ప్యానల్ నుంచి పొగలు రావటం మొదలైంది. వెంటనే గుర్తించిన ప్రయాణికులు.. సిబ్బందిని అలెర్టు చేశారు. ఆదివారం రాత్రి 10.15 గంటల వేళలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

వెంటనే స్పందించిన సిబ్బంది.. రైలును ఆపేశారు. పొగలు ఎందుకు వస్తున్నాయని చెక్ చేయగా.. థర్డ్ ఏసీ బోగీ (బీ4)లోని ఏసీ కంట్రోల్ ప్యానల్ లో ఎలుక దూరింది. దీంతో.. పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించి.. వెంటనే సరి చేశారు. దీంతో.. అప్పటివరకు తెగ టెన్షన్ పడిపోయిన ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలుక ఎంత పని చేసిందని తమ టెన్షన్ కు నవ్వుకుండిపోయారు. మొత్తానికి ఆడుతూ పాడుతూ సినిమాలో ఎలుక బస్సులో దూరి సునీల్ ను తిప్పలు పెట్టినట్టు ఈ ఎలుక గోదావరిని తిప్పలు పెట్టింది.