తిరుమ‌ల `న‌ర‌క దారి`కి బాధ్యులు ఎవ‌రు? 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తులు.. కేవ‌లం ద‌ర్శించుకుని త‌నివి తీర్చుకోవాల‌ని రారు. వేయి రూపాల వెంక‌న్న‌ను.. వివిధ మార్గాల్లో వెళ్లి వివిధ రూపాల్లో ద‌ర్శించుకోవాల‌ని.. మొక్కుకుని మ‌రీ అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని న‌డ‌క మార్గాల్లో నారాయ‌ణ‌సేవ చేస్తూ.. ముందుకు సాగుతారు. అయితే.. ఇప్పుడు తిరుమ‌ల శ్రీవారి న‌డ‌క దారి.. న‌ర‌క దారిగా మారిపోయింది. కేవ‌లం వారం ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో చిరుత‌ల దాడి క‌ల‌క‌లం రేపుతోంది.

వారం ప‌ది రోజుల కింద‌ట జ‌రిగిన చిరుత దాడిలో ఒక చిన్నారి ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌గా.. తాజాగా ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్యంత దారుణంగా చిరుత ఆ చిన్నారిని క‌బ‌ళించిన తీరును పోస్టు మార్టం రిపోర్టు స్ప‌ష్టం చేసింది. అయితే.. ఈ పాపం ఎవ‌రిది?  అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడిని ద‌ర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వ‌స్తున్న భ‌క్తుల‌దా?  కేవలం వీఐపీ సేవ‌లోనే త‌రిస్తున్న ఆల‌య పాల‌క మండ‌లి బోర్డు స‌భ్యుల‌దా?  లేక‌.. ఆదాయ, వ్య‌యాలు.. మిగుళ్ల లెక్క‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్న అధికార గ‌ణానిదా?  ఎవరిది?  ఇప్పుడు ఇదే చ‌ర్చ సాగుతోంది.

తిరుమ‌ల న‌డ‌క మార్గంలో వ‌న్య ప్రాణి సంచారం.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు.. భ‌క్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించా ల్సిన అంశాల‌పై ఇప్ప‌టికే తిరుమ‌ల పాల‌క‌మండ‌ళ్లు రెండు సార్లు అత్యున్న‌త క‌మిటీలు వేసి.. నివేదిక లు తీసుకున్నాయి. సీనియ‌ర్ ఫారెస్టు అధికారి రామానుజాచారి ఇచ్చిన నివేదిక‌తోపాటు.. స్వ‌యంగా క‌నుమూరి బాపిరాజు పాల‌క మండ‌లి చైర్మన్‌గా ఉన్న‌ప్పుడు మండ‌లి స‌భ్యుల‌తో చేయించిన అధ్య‌య నంలోనూ భ‌క్తుల ర‌క్ష‌ణ‌కు చేప‌ట్టాల్సిన అంశాల‌పై పుంఖాను పుంఖాలుగా నివేదిక లు స‌మ‌ర్పించారు.

న‌డ‌క మార్గంలో వ‌న్య‌ప్రాణులు రాకుండా.. ప్ర‌త్యేక ఇనుప కంచెను సుమారు 2000 మీట‌ర్ల మేర‌కు ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్ర‌ధాన సూచ‌న‌. అయితే.. దీనికి ఫారెస్టు అధికారుల నుంచి అనుమ‌తిరావ‌డం లేద‌నే వంక‌తో ఇప్ప‌టికీ చేప‌ట్ట‌లేదు. మ‌రో ముఖ్య సూచ‌న‌.. న‌డ‌క మార్గంలో చెంచుల‌ను నియ‌మించి.. వ‌న్య‌ప్రాణులను ద‌రిచేర‌కుండా చూడాల‌నేది మ‌న్నికైన మ‌రో సూచ‌న‌. ప్ర‌స్తుతం ఇది శ్రీశైలం న‌డ‌క మార్గంలో ఉంది. కానీ, తిరుమ‌ల న‌డ‌క మార్గంలో సుమారు 500 మంది అవ‌స‌రం అవుతార‌ని(రెండు షిఫ్టుల్లో..) అంత ఖ‌ర్చు ఎందుక‌ని అప్ప‌ట్లో పేర్కొన్న పాల‌క‌ మండ‌లి.. త‌ర్వాత ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను బుట్ట దాఖ‌లు చేసింది. వెర‌సి.. శ్రీవారి న‌డ‌క మార్గం.. న‌ర‌క మార్గంగా మారింది.