బెదిరింపుల దెబ్బకు రచయితకు సెక్యూరిటీ  

ఆదిపురుష్ వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించినప్పటికీ కాంట్రావర్సీలు మాత్రం ఆగడం లేదు. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ బ్యాన్ చేయాలని  ఏకంగా ప్రధాన మంత్రికి ఉత్తరం రాయడం ఇప్పటికే ప్రకంపనలు రేపింది. తాజాగా రచయిత మనోజ్ ముంతషీర్ కు చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఆయనకు ముంబై పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీతాదేవి భారతదేశంలో పుట్టినట్టు అర్థం వచ్చే డైలాగులు, హనుమంతుడితో చెప్పిన తైలం సంభాషణలు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకున్నాయి.

దానికి తోడు అసలు తాము రామాయణమే తీయలేదని మనోజ్ ముంతషీర్ మొన్నో ఇంటర్వ్యూలో బుకాయించడం అగ్నికి ఆజ్యం పోసింది. కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని ఇది పూర్తిగా వేరే కథని కలరింగ్ ఇవ్వడం రివర్స్ అయ్యింది. ఎందుకంటే ఇతనే కొన్ని నెలల క్రితం ఆదిపురుష్ రాముడి గాథ ఆధారంగా రూపొందుతోందని సెలవిచ్చాడు. దెబ్బకు ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ద్వారా మనోజ్ కు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఈయన రాతల వల్లే నేపాల్ లో ఏకంగా బాలీవుడ్ సినిమాలనే బ్యాన్ చేసే పరిస్థితి వెళ్ళింది. సో రక్షణ అవసరమేనని చెప్పాలి

అయినా దర్శకుడి సమ్మతి లేకుండా ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాయకుండా ఏ రచయిత స్వంత తెలివి తేటలు ఎక్కువ చూపించలేడు. అలాంటప్పుడు ఓం రౌత్ కూడా లక్ష్యమేనని నెటిజెన్లు లాజిక్ తీస్తున్నారు. ఆలా అని ఈయనకు వార్నింగ్స్ రాలేదని కాదు. వచ్చాయి. ఆదిపురుష్ బ్యాన్ పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే సూచనలు లేవు కానీ ఈ వివాదాలన్నీ మాట్లాడుకోవడానికి తప్ప కలెక్షన్ల పరంగా ఎంత వరకు ఉపయోగపడతాయన్నది కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది. వీటి వల్లే ముందుగా ప్లాన్ చేసుకున్న ఇంటర్వ్యూలన్నీ ఆదిపురుష్ టీమ్ రద్దు చేసుకుంది