షిర్డీ వెళ్తున్నాన‌ని చెప్పి.. స్నేహితుడి భార్య‌తో జంప్‌

వివాహేతర సంబంధాల‌కు వాటి వ‌ల్ల క‌లుగుతున్న ప‌ర్య‌వ‌సానాల‌కు ఎక్క‌డా అడ్డుక‌ట్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలో వావి, వ‌రుస‌లు కూడా మ‌రిచిపోతున్నారు.. ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాలు స‌మాజం త‌ల‌దించుకునేలా చేస్తున్నా.. ఈ కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌వారు మాత్రం.. నిస్సిగ్గుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఘ‌ట‌న అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.

మారేడుప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న్యూ బోయిన్‌ప‌ల్లిలో 45 ఏళ్ల‌ అతుల్ వ‌డ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయితే.. ఒక స్నేహితుడి ఇంటికీ త‌ర‌చుగా వెళ్లే అతుల్‌.. స‌ద‌రు స్నేహితుడి భార్య‌పై క‌న్నేశాడు. మెల్ల‌గా ముగ్గులోకి లాగాడు. అతుల్‌కు కూడా వివాహం అయింది. అయితే.. ఇంట్లో చెప్ప‌కుండానే స‌ద‌రు స్నేహితుడి భార్యంతో ప్రేమాయ‌ణం కొన‌సాగించాడు.

ఇక‌, ఈ విష‌యం స్నేహితుడికి కూడా తెలిసింది. మ‌రి ఆయ‌న ఏం చేశాడంటే.. మౌనంగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు స్నేహితులకు మ‌ధ్య న‌గ‌దు లావాదేవీలు ఉన్నాయ‌ని స‌మాచారం. అందుకే.. త‌న భార్య‌తో స్నేహం ఏంట‌ని ప్ర‌శ్నిస్తే.. సంబంధిత న‌గ‌దు ఇవ్వాల‌ని ఒత్తిడి చేసే అవ‌కాశం ఉంద‌ని భావించాడో ఏమో.. త‌న భార్య‌తో అతుల్ స్నేహంగా ఉన్న‌ప్ప‌టికీ.. చూస్తూ ఉన్నాడు.

ఇదిలావుంటే.. తాజాగా అతుల్‌.. స్నేహితుడి భార్య‌తో జంప్ అయిపోయాడు. అయితే.. త‌న భార్య‌కు మాత్రం ప‌విత్ర షిర్డీకి వెళ్తున్నాన‌ని.. సాయినాథుడుని ద‌ర్శించుకుని వ‌స్తాన‌ని చెప్పాడు. దీంతో ఆఇల్లాలు.. భ‌ర్త చెప్పిన మాట‌ల‌ను న‌మ్మింది. కానీ, మరుసటిరోజు నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అయితే అతుల్‌ తన భార్యకు రాసిన లేఖ ఇంట్లో దొరికింది. అందులో తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండడానికి వెళ్తున్నానని, ఈ విషయం తన స్నేహితుడికి తెలుసునని పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.

దీంతో ప‌రుగు ప‌రుగున అతుల్ స‌తీమ‌ణి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న భ‌ర్త రాసిన లేఖ‌తో పాటు.. ఇంట్లో రూ.10 ల‌క్ష‌లు క‌నిపించ‌డం లేద‌ని తెలిపింది. దీంతో మారేడుపల్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. స్నేహితుడు కావాల‌నే త‌న భార్య‌ను అతుల్‌తో పంపించాడా? త‌న అప్పులకు త‌న భార్య‌ను ఎర‌వేశాడా? అనేది తేలాల్సి ఉంది. ఇక‌, అతుల్ రాసిన లేఖ‌లో మ‌రో కీల‌క అంశం.. తమను వెతకవద్దని పేర్కొన‌డం.