కేరళలో 20 మంది ప్రాణాల్ని తీసిన పడవ ప్రమాదం

కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతంలో ఇరవై మంది మరణించారు.

షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో పడవ ఎందుకు బోల్తా పడిందన్న విషయంపై స్పష్టత రావట్లేదు. దీనిపై అధికారులు విచారిస్తున్నారు. తనూర్ పట్టణ తువల్తీరం బీచ్ సమీపంలో 30 మందిలో వెళుతున్న పడవ బోల్తా పడింది.

దీంతో.. పలువురు పడవ అడుగు భాగానికి వెళ్లిపోయారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వటంతో వారంతా విహారయాత్రకు వచ్చి.. పడవ ప్రమాదంలో చిక్కుకుపోయారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పడవ అడుగు భాగంగా ఇరుక్కున్న విషయాన్ని గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి పది మంది బయటపడ్డారు. మరణించిన వారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యల సమన్వయం కోసం చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. వీరితో పాటు కేరళ క్రీడా మంత్రి అబ్దు రహిమాన్.. పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్ లు దగ్గరుండి సాయం చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల వేళలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం.. చీకటి కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి.